నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్‌ సెటైర్లు: తీవ్ర చర్చ

3 Aug, 2022 10:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశ ఆర్థిక పరిస్థితి,  ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాల డిమాండ్‌పై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై  బీజేపీ  సీనియర్‌ నేత  సుబ్రమణియన్ స్వామి  సెటైర్లు వేశారు. ఆర్థిక మాంద్యం భయాలు, భారత్‌ కరెన్సీ రూపాయి విలువ పతనం తదితర అంశాలను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్‌ దేశంలో  మాంద్యం పరిస్థితులన్న ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. డాలర్‌ మారకంలోభారత్‌ రూపాయి విలువ కుప్పకూలలేదని అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు.  

దీనిపై బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ వ్యంగ్యంగా  స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రసక్తే లేదు.. నిజమే, ఆమె సరిగ్గా చెప్పారు. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది క్రితమే మాంద్యంలోకి జారుకుందంటూ ఘాటుగానే కౌంటర్‌ ఇచ్చారు. ఇక  మాంద్యం లోకి జారుకోవడం అనే ప్రశ్న లేదంటూ విమర్శించారు. తద్వారా దేశ ఆర్థికపరిస్థితి, నిర్మలా సీతారామన్‌ ప్రకటనపై ట్వీట్‌ చేసి  మోదీ సర్కార్‌పై వ్యంగ్య బాణాల్ని సంధించడమే కాదు, తీవ్ర చర్చకు తెర తీశారు. (ఆనంద్‌ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్‌ మామూలుగా లేవు!)

కాగా ద్రవ్యోల్బణంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లు,సంక్షోభం ఉన్నప్పటికీ దేశం మంచి స్థితిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్‌ నిలుస్తోందని, అలాగే పరిస్థితులను నియంత్రించేందుకు  రిజర్వు బ్యాంక్ చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. ముఖ్యంగా అమెకా పరిస్థితిని ప్రస్తావిస్తూ, భారత్‌లో మాంద్యం వచ్చే ప్రశ్నే లేదని సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. (బ్లెస్సింగ్స్‌ అడిగిన కస్టమర్‌కు ఆనంద్‌ మహీంద్ర అదిరిపోయే రిప్లై)
 

>
మరిన్ని వార్తలు