కోత పడింది.. ఈ ఏడాది వృద్ధి 6.1 శాతమే

1 Feb, 2023 09:33 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2022–23) దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా కోత పెట్టింది. 2022లో సాధించిన 6.8 శాతంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదుకాగలదని అభిప్రాయపడింది. మరోపక్క ప్రపంచ ఆర్థిక భవిష్యత్‌పట్ల జనవరి అంచనాలను వెలువరించింది. దీనిలో భాగంగా ప్రపంచ వృద్ధి అంచనాలను సైతం 3.4 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గించింది.

అయితే వచ్చే ఏడాది(2024)లో కొంత పుంజుకుని 3.1 శాతం పురోగతి నమోదుకాగలదని అంచనా వేసింది. నిజానికి అక్టోబర్‌లో ప్రకటించిన ఇండియా వృద్ధి ఔట్‌లుక్‌ 6.8 శాతంలో ఎలాంటి మార్పులేదని, విదేశీ అంశాల కారణంగా కొంతమేర మందగించి 6.1 శాతంగా నమోదుకాగలదని తాజాగా భావిస్తున్నట్లు ఐఎంఎఫ్‌ రీసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఎకనమిస్ట్, డైరెక్టర్‌ పియరీ ఒలీవియర్‌ గొరించాస్‌ పేర్కొన్నారు. తిరిగి వచ్చే ఏడాది(2023–24)లో 6.8 శాతం వృద్ధిని సాధించగలదని అంచనా వేశారు. విదేశీ సవాళ్లు ఎదురైనప్పటికీ ఇందుకు దేశీ డిమాండు సహకరించగలదని అభిప్రాయపడ్డారు.

చదవండి: కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు..పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు!

మరిన్ని వార్తలు