ఎకానమీ 7 శాతం వృద్ధి సాధ్యమే

22 Dec, 2022 03:09 IST|Sakshi

వచ్చే ఏడాది ఇదే స్థాయిలో ఉండొచ్చు

నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పనగరియా

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా అభిప్రాయపడ్డారు. రానున్న బడ్జెట్‌లో ఆశ్చర్యకమైన ప్రతికూల అంశాలు ఏవీ లేకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం జీడీపీ ఇదే స్థాయిలో వృద్ధి చెందే అవకాశాలున్నట్టు చెప్పారు. మాంద్యానికి సంబంధించిన భయాలు కొంత కాలంగా వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు అమెరికా కానీ, యూరప్‌ కానీ మాంద్యంలోకి జారలేదన్నారు. భారత్‌కు సంబంధించి గడ్డు పరిస్థితులు ముగిసినట్టేనన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను ఇటీవలి సమీక్షలో ఆర్‌బీఐ 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించడం తెలిసిందే. ప్రపంచబ్యాంకు కూడా భారత్‌ జీడీపీ 6.9% వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలను వ్యక్తం చేసింది.

రూపాయిపై ఒత్తిడి..   
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తాను ఇప్పటికీ భావిస్తున్నట్టు పనగరియా స్పష్టం చేశారు. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు కారణంగా విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతుండడం రూపాయిపై ఒత్తిడికి దారితీసినట్టు వివరించారు. నవంబర్‌ నెల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఆగి, నికర పెట్టుబడులకు దారితీసిన విషయాన్ని పనగరియా గుర్తు చేశారు. దీనికితోడు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగొస్తుండడంతో అక్కడ కూడా గడ్డు పరిస్థితులు ముగిసినట్టేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రూపాయి ఇదే కాలంలో యూరో, యెన్‌ తదితర కరెన్సీలతో బలపడిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికంటే ముందు నాటికే రూపాయి అధిక వ్యాల్యూషన్‌లో ఉన్నట్టు చెప్పారు. కనుక సమీప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ మరింత తగ్గడం పట్ల తాను సానుకూలంగా ఉన్న ట్టు తెలిపారు. లేబర్‌ ఫోర్స్‌ సర్వే గణాంకాలను గమనిస్తే దేశంలో నిరుద్యోగం ఏమంత అధికంగా లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు