దశాబ్దం పాటు 6.5 శాతం వృద్ధి

1 Apr, 2023 03:02 IST|Sakshi

ముఖ్య సలహాదారు అనంత నాగేశ్వరన్‌

న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలం పాటు భారత్‌ 6.5 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి నుంచి ఎగుమతులు అన్నవి కొంత నిదానంగా ఉండొచ్చని, ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, వృద్ధిపై మన ఎగుమతులు ఆధారపడి ఉంటాయన్నారు.

వాణిజ్య, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో ఆర్థిక, రుణ, పెట్టుబడుల సైకిల్‌ పునరుద్ధరణతో రానున్న పదేళ్ల పాటు సగటున 6.5 శాతం వృద్ధి సాధ్యమేనని నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. భారత్‌ ఆర్థిక వృద్ధి నిదానించడం అన్నది కరోనాకి ముందే, సహజంగానే మొదలైనట్టు అంగీకరించారు. బ్యాంక్‌ బ్యాలన్స్‌ షీట్ల ప్రస్తావన, ఆ తర్వాత కరోనా మమహ్మారి రూపంలో, ఆ తర్వాత కమోడిటీల ధరల పెరుగుదల రూపంలో సవాళ్లు ఎదురైనట్టు చెప్పారు. సహజంగానే ఇవి ప్రైవేటు ఇన్వెస్టర్లలో అనిశ్చితికి దారితీస్తాయన్నారు.

మరిన్ని వార్తలు