30 ఏళ్లలో 30 ట్రిలియన్‌ డాలర్లకు

27 Jun, 2022 05:52 IST|Sakshi

దేశ ఆర్థిక వ్యవస్థపై పీయూష్‌ గోయల్‌

తిరుపూర్‌: భారత్‌ ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని, వచ్చే 30 ఏళ్ల కాలంలో 30 ట్రిలియన్‌ డాలర్లకు (రూ.2,310 లక్షల కోట్లు) విస్తరిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. తిరుపూర్‌ వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌ ఏటా 8 శాతం చొప్పున కాంపౌండెడ్‌ వార్షిక వృద్ధి రేటు నమోదు చేసినా వచ్చే తొమ్మిదేళ్ల కాలంలో రెట్టింపు అవుతుందన్నారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3.2 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందంటూ.. వచ్చే తొమ్మిదేళ్లలో 6.5 ట్రిలియన్‌ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా వ్యక్తం చేశారు. ‘‘ఆ తర్వాత తిమ్మిదేళ్లలో ఆర్థిక వ్యవస్థ 6.5 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 13 ట్రిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాల్లో అంటే 27 ఏళ్లకు 26 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. కనుక 30 ఏళ్ల తర్వాత కచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అధిగమిస్తుంది’’అని మంత్రి వివరించారు.

కానీ విమర్శకులు ఈ గణాంకాలపై విమర్శలు కురిపిస్తుంటారని, అటువంటి వారు తిరుపూర్‌ వచ్చి టెక్స్‌టైల్‌ రంగం వృద్ధిని చూడాలని మంత్రి సూచించారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కారణంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లోరూ.. మన దేశ ఆర్థికవ్యవస్థ ఆరోగ్యకరమైన స్థాయిలో వృద్ధిని సాధిస్తోందని మంత్రి పేర్కొన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో కొన్ని కమోడిటీలకు కొరత ఏర్పడి ద్రవ్యోల్బణం ఎగిసేందుకు దారితీసినట్టు చెప్పారు. అయినా భారత్‌ తన ద్రవ్యోల్బణాన్ని మోస్తరు స్థాయిలో కట్టడి చేసినట్టు తెలిపారు. నిత్యావసరాల ధరలు తగిన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకున్నట్టు వివరించారు.  

మరిన్ని వార్తలు