అంచనాలకు మించి రికవరీ

27 Nov, 2020 06:42 IST|Sakshi

పెరుగుతున్న కోవిడ్‌ కేసులతోనే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి విఘాతం

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌  

ముంబై: భారత్‌ ఆర్థిక వ్యవస్థ రికవరీ తొలి అంచనాలకన్నా పటిష్టంగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌  పేర్కొన్నారు. అయితే కరోనా కేసుల పెరుగుదలే వృద్ధికి ప్రతికూలమనీ ఆయన అన్నారు. రెండవ త్రైమాసిక (జూలై–సెప్టెంబర్‌) గణాంకాలు . శుక్రవారం (27వ తేదీ)  వెలువడుతుండడం,  క్యూ2లో  క్షీణ రేటు ‘సింగిల్‌’ డిజిట్‌లోనే (10 శాతంలోపే) ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో గవర్నర్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రేరిత సమస్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.  విదేశీ మారకానికి సంబంధించి భారత్‌ డీలర్ల సంఘం (ఎఫ్‌ఈడీఏఐ) వార్షిక దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్‌ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే...

► వృద్ధి రికవరీకి సంబంధించి.. పండుగ సీజన్‌ అనంతరం డిమాండ్‌ కొనసాగడం, పెరుగుతున్న కరోనా కేసులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సిన్‌ అందుబాటు విషయంలో మార్కెట్‌ పునఃమదింపు ఎలా ఉంటుం దన్నదీ పరిశీలించాల్సిన  ముఖ్యాంశాల్లో ఒకటి.

► తొలి త్రైమాసికంలో భారీ క్షీణత అనంతరం, క్యూ2లో ఆర్థిక క్రియాశీలత ఊహించినదానికన్నా వేగంగా ఉంది. రికవరీలో పటిష్టత నమోదైంది.  

► గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం లక్ష్యాలను మించి (ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 4 శాతం వద్ద రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం) ఉంటోందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ అంశాన్ని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) జాగ్రత్తగా పరిశీలించి రేటు కోతకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తాత్కాలికమైనవనీ, ధరల తీవ్రత క్రమంగా తగ్గుతుందని అక్టోబర్‌ పరపతి సమీక్ష అభిప్రాయపడింది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ, రేట్ల కోత అంశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సరళతర విధానాన్నే పాటించాలనీ నిర్దేశించుకుంది.  

► తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండడం భారత్‌కు ప్రస్తుతం కలిసి వస్తున్న అంశం. నవంబర్‌ 13 నాటికి భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు 572.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఏడాది దిగుమతులకు ఇవి సరిపోతాయి.  

► 2020 తరహా సంవత్సరాన్ని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ అవకాశాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. యూరోప్‌లోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొం టున్నాయి. ప్రపంచ వృద్ధికి ప్రతికూలాంశమిది.  

► మార్కెట్లపై మహమ్మారి పలు విధాలుగా ప్రతికూల ప్రభావాలు చూపింది. ఆర్థిక మందగమనం, ద్రవ్య లభ్యత, కమర్షియల్‌ పేపర్, కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ క్షీణత, రూపాయి విలువ వంటి ఎన్నో అంశాల్లో ప్రతికూలతలు ఏర్పాడ్డాయి.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా