పటిష్ట బాటన ఎకానమీ

25 Sep, 2021 03:34 IST|Sakshi

జీఎస్‌టీ, ప్రత్యక్ష పన్నుల భారీ వసూళ్లే ఉదాహరణ

స్టాక్‌ మార్కెట్‌ నుంచీ సానుకూల సంకేతాలు

డీమానిటైజేషన్‌తో నల్లధనం, నకిలీ కరెన్సీకి చెక్‌

ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌  

చండీగఢ్‌: భారత్‌ ఎకానమీ పటిష్ట పునరుజ్జీవ బాటన పయనిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ శుక్రవారం పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ),  ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా నమోదుకావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని స్టాక్‌ మార్కెట్‌ కూడా ప్రతిబింబిస్తోందన్నారు. రిటైల్, చిన్న ఇన్వెస్టర్లు సైతం స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. మీడియాను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► కరోనా సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవ బాట పట్టిందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. 

► ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి 2021–22 అర్ధ వార్షిక లక్ష్యాలను (ఏప్రిల్‌–సెపె్టంబర్‌) ఇప్పటికే సాధించడం జరిగింది. జీఎస్‌టీ వసూళ్లు సగటున రూ.1.11 లక్షల కోట్లు– రూ.1.12 లక్షల కోట్ల శ్రేణిలో ఉన్నాయి. 2022 మార్చితో ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే నాటికి ఈ సగటు రూ.1.15 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది.  

► స్టాక్‌ మార్కెట్‌పై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. కంపెనీల లిస్టింగ్, సంబంధిత నిబంధనల్లో పారదర్శకత దీనికి ప్రధాన కారణం. అందువల్లే గతంలో మ్యూచువల్‌ ఫండ్స్‌పై మొగ్గుచూపే ఎక్కువగా రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇప్పుడు డీ మ్యాట్‌ అకౌంట్‌ ద్వారా ప్రత్యక్షంగా మార్కెట్‌పై కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.  

► పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) వల్ల వ్యవస్థలో నల్లధనం, నకిలీ కరెన్సీ కట్టడి జరిగింది.  

► పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోనికి తెచ్చే అంశంపై పరోక్ష పన్నుల అత్యున్నత స్థాయి మండలే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  

► రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుంది.  

► ఆర్థిక కార్యకలాపాల విషయంలో ‘అందరితో కలిసి, అందరి సంక్షేమం కోసం, అందరి విశ్వాసంతో, అందరి కృషితో’ పనిచేయాలన్నది కేంద్రం విధానం. ఇదే విధానానికి కేంద్రం కట్టుబడి ఉంది.  

► కరోనా విసిరిన సవాళ్ల నేపథ్యంలో వ్యాపార సంస్థలు సైతం తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ప్రత్యేకించి డిజిటలైజేషన్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.  

► జన్‌ధన్‌ పథకం వల్ల 80 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం కింద 40 కోట్లకుపైగా అకౌంట్లు ఉన్నాయి.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు