ఎకానమీ గాడిన పడుతోంది..!

19 Aug, 2021 09:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకించి కార్పొరేట్‌ రికవరీ విస్తృత ప్రాతిపదికన ఉండడం సంతృప్తి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ కంపెనీల రుణ నాణ్యతా అవుట్‌లుక్‌ను ప్రస్తుత ‘జాగరూకతతో కూడిన ఆశావాదం’ నుంచి ‘పాజిటివ్‌’కు మార్చుతున్నాం. ఫైనాన్షియల్‌ రంగం మినహా 43 రంగాలను అధ్యయనం చేయడం జరిగింది. ఆయా రంగాలు అన్నింటిలో పురోగమన ధోరణి కనిపిస్తోంది. వీటిలో నిర్మాణం, ఇంజనీరింగ్, పునరుత్పాదక ఇంధనంసహా 28 రంగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మహమ్మారి ముందస్తు స్థాయికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నాం. మిగిలినవి ఆ స్థాయిలో 85 శాతానికి చేరుకుంటాయి.

భారత్‌ కార్పొరేట్‌ రంగం మూలాలు పటిష్టంగా ఉన్నాయి. మూడవ వేవ్‌ సవాళ్లు లేకుండా ఉంటే దేశీయ డిమాండ్‌ మరింత పెరుగుతుంది. అంతర్జాతీయ సానుకూల అంశాలు కూడా దీనికి తోడవుతాయి. స్టీల్‌ ఇతర మెటల్స్, ఫార్మా, రసాయనాల రంగాల్లో డిమాండ్‌ బాగుంటుంది. కాగా ఆతిథ్యం, విద్యా సేవలు ఇంకా మెరుగుపడల్సి ఉంది. ఫైనాన్షియల్‌ రంగం కూడా 2020తో పోల్చితే ప్రస్తుతం బాగుంది. ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న పలు చర్యలు దీనికి కారణం. మొండి బకాయిల తగ్గింపు చర్యల ఫలితాలు సానుకూలంగా కనబడుతున్నాయి. రుణ లభ్యత మరింత మెరుగుపడే వీలుంది.  

జూన్‌ త్రైమాసికంలో 20 శాతం వృద్ధి: ఇక్రా
భారత్‌ ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) ఎనామనీ వృద్ధి 20 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం. అయితే దీనికి గత ఏడాది ఇదే కాలంలో లో బేస్‌ (24 శాతం క్షీణత) ప్రధాన కారణం. ఎకానమీ 20 శాతం పురోగమించినప్పటికీ, విలువల్లో కోవిడ్‌–19 ముందస్తు స్థాయికి చేరుకోడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, ఎగుమతులు, వ్యవసాయ రంగం నుంచి డిమాండ్‌ వంటి అంశాలు ఎకానమీ విస్తృత ప్రాతిపదికన రికవరీకి దోహదపడుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలు నిర్మాణ రంగం పురోగతికి దోహదపడతాయి. ఈ రంగం జూన్‌ త్రైమాసికంలో కోవిడ్‌–19 ముందస్తు స్థాయికి చేరుకునే అవకాశాలూ ఉన్నాయి. వస్తువుల ఉత్పత్తి వరకూ సంబంధించిన జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌) వృద్ధి) జూన్‌ త్రైమాసికంలో 17 శాతం వరకూ ఉంటుందని విశ్వసిస్తున్నాం. ప్రీ కోవిడ్‌ ముందు పరిస్థితిని పోల్చితే 2021–22 తొలి త్రైమాసికంలో జీడీపీ, జీవీఏలు దాదాపు 9 శాతం క్షీణతలోనే ఉంటాయని భావిస్తున్నాం. పంట దిగుబడులు బాగుండే పరిస్థితులు కనిపిస్తుండడం హర్షణీయ పరిణామం. ఇది గ్రామీణ డిమాండ్‌ పటిష్టంగా ఉండడానికి దోహదపడుతుంది.

మరిన్ని వార్తలు