స్టాక్‌ మార్కెట్‌లో రంకెలేస్తున్న బుల్‌.. ప్రపంచంలో భారత్‌ టాప్‌

28 Aug, 2021 09:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్‌ చూడని లాభాన్ని గడచిన ఏడాది కాలంలో భారత స్టాక్‌ మార్కెట్‌ చూసింది. ఈ మేరకు వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం, నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌– నిఫ్టీ గడచిన 12 నెలల కాలంలో  ఏకంగా 45 శాతం పురోగమించింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ చూసినా 19 శాతం పురోగమించింది.

ఆర్థిక రికవరీ, ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్‌ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుతో రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్‌లోకి భారీగా రావడం దీనికి కారణం. ఒక నివేదిక వెలువరించిన అంశాల్లో ముఖ్యమైనవి...

 

అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లను పరిగణనలోకి తీసుకునే ఎంఎస్‌సీఓ వరల్డ్‌ ఇండెక్స్‌ గత 12 నెలల్లో 15 శాతం పురోగమిస్తే, వర్థమాన దేశాల మార్కెట్లను ప్రతిబింబించే ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ సూచీ 29 శాతం లాభపడింది. వీటికన్నా  నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌–  నిఫ్టీ వేగం అధికంగా ఉంది.
 
 భారత్‌ మార్కెట్ల రిటర్న్స్‌ పరిస్థితి కూడా గ్లోబల్‌ మార్కెట్లతో సరిపోల్చితే గణనీయంగా మెరుగుపడింది. ఇందుకు సంబంధించి నిష్పత్తి గతంలో 80 శాతం ఉంటే, తాజాగా 61 శాతానికి మెరుగుపడింది.
 
 ఇక గడచిన ఏడాది కాలంలో భారత్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక ట్రిలియన్‌ డాలర్లమేర పెరిగి, 3.17 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. తద్వారా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విషయంలో ప్రపంచంలో భారత్‌ ఎనిమిదవ స్థానానికి చేరింది. భారత్‌ ముందు ఈ విషయంలో అమెరికా (51.39 ట్రిలియన్‌ డాలర్లు), చైనా (12.16 ట్రిలియన్‌ డాలర్లు), జపాన్‌ (6.77 ట్రిలియన్‌ డాలర్లు), హాంకాంగ్‌ (6.38 ట్రిలియన్‌ డాలర్లు), బ్రిటన్‌  (3.68 ట్రిలియన్‌ డాలర్లు), ఫ్రాన్స్‌ (3.35 ట్రిలియన్‌ డాలర్లు) ఉండగా, 9, 10 స్థానాల్లో కెనడా (3.15 ట్రిలియన్‌ డాలర్లు), జర్మనీ (2.88 ట్రిలియన్‌ డాలర్లు) ఉన్నాయి.
 
 గడచిన ఏడాది కాలంలో ఫారిన్‌ పోర్టిఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత్‌లో రూ.2.2 లక్షల కోట్ల (31 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు వస్తే, క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప) ద్వారా వచ్చిన రిటైల్‌ పెట్టుబడుల విలువ లక్ష కోట్లుగా ఉంది.
 
 ఎకానమీ వృద్ధి వాతావరణం, మెరుగుపడుతున్న కార్పొరేట్‌ మార్జిన్లు, తక్కువ పన్ను రేట్లు, సరళతరమైన రీతిలో తక్కువ స్థాయిలో వడ్డీరేట్ల వ్యవస్థ వంటి అంశాలు భారత్‌ ఆర్థిక వ్యవస్థ రీ–రేటింగ్‌కు దోహదపడే అవకాశం ఉందని ఇటీవల ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ ఇటీవలే ఒక నివేదికలో పేర్కొంది.

చదవండి : రూపాయి.. అధరహో

మరిన్ని వార్తలు