లేస్‌ చిప్స్‌ ‘ఆలు’పై పేటెంట్‌ రైట్స్‌ రద్దు.. భారత రైతులకు భారీ ఊరట

4 Dec, 2021 11:44 IST|Sakshi

Pepsico Lays Chips Potato Patent Rights Revoked In India: ప్రముఖ ఫుడ్‌ అండ్‌ స్నాక్‌ కంపెనీ ‘పెప్సీకో’కి భారత్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చిప్స్‌ తయారీ కోసం ఉపయోగించే ప్రత్యేకమైన ఆలు వంగడంపై హక్కులు పూర్తిగా పెప్సీకో సొంతం మాత్రమే కాదనే తీర్పు వెలువడింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్ హక్కుల్ని రద్దు చేస్తూ..  మొక్కల రకాల పరిరక్షణ & రైతు హక్కుల అధికార సంఘం Protection of Plant Varieties and Farmers' Rights (PPVFR) Authority శుక్రవారం తీర్పు వెలువరించింది.  


లేస్‌ చిప్స్‌ తయారీకి ఉపయోగించే బంగాళదుంప వంగడంపై రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ తమపేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులెవరూ(ఒప్పంద పరిధిలో ఉన్నవాళ్లని మినహాయించి) వాటిని పండించడానికి వీల్లేదంటూ న్యూయార్క్‌కు చెందిన ఈ మల్టీనేషనల్‌ ఫుడ్‌ కంపెనీ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. అయితే కేవలం పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తిగా రైతుల్ని నిలువరించడం కుదరని, అందుకు చట్టం సైతం అంగీకరించదంటూ PPVFR తీర్పు వెలువరించింది. ఈ మేరకు పెప్సీకో కంపెనీకి గతంలో జారీ అయిన పేటెంట్‌ హక్కుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో  రైతులు సంబురాలు చేసుకున్నారు.  

‘రైతుల విత్తన స్వేచ్ఛ’ను ఉల్లంఘించకుండా ఇతర విత్తన,  ఆహార సంస్థలను కూడా  నిలువరించాలని ఈ సందర్భంగా PPVFRను రైతుల తరపున పిటిషన్‌ దాఖలు చేసిన కవిత కురుగంటి కోరుతున్నారు. ఇక ఈ వ్యతిరేక పరిణామంపై స్పందించేందుకు పెప్సీకో కంపెనీ నిరాకరించింది. 

ఏంటీ వంగడం.. 

ఎఫ్‌ఎల్‌-2027 (FC5) వెరైటీ పొటాటోలు. వీటిని లేస్‌ పొటాటో చిప్స్‌గా పేర్కొంటారు. చిప్స్‌ తయారీలో ఉపయోగించే ఈ వంగడాల్ని 2009లో భారత్‌లోకి తీసుకొచ్చింది పెప్సీకో కంపెనీ. సుమారు 12 వేల మంది రైతులకు వీటి విత్తనాల్ని అందించి..  తిరిగి దుంపల్ని చేజిక్కిచ్చుకునేలా ఒప్పందం ఆ సమయంలో  కుదుర్చుకుంది. అంతేకాదు 2016లో ఈ వెరైటీ వంగడం మీద.. ‘పీపీవీ అండ్‌ ఎఫ్‌ఆర్‌ చట్టం 2001’ ప్రకారం అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది.

 

ఏప్రిల్‌ 2019లో తమ హక్కులకు భంగం కలిగిందంటూ పెప్సీకో కంపెనీ దావా వేయడం ద్వారా ఈ వంగడం గురించి బయటి ప్రపంచానికి బాగా తెలిసింది. తమ ఒప్పందం పరిధిలోని లేని తొమ్మిది మంది గుజరాత్‌ రైతులు ఈ వంగడం పండిస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..  అందులో నలుగురు చిన్న రైతులపై 4.2 కోట్ల రూ.కు దావా వేసింది పెప్సీకో కంపెనీ.  అయితే సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో కలగజేసుకుంది. దీంతో అదే ఏడాది మే నెలలో పెప్సీకో కంపెనీ కేసులు మొత్తం వెనక్కి తీసుకుంది.

 

ఆ వెంటనే రైతు ఉద్యమకారిణి కవితా కురుగంటి..  పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ రద్దు చేయాలంటూ PPVFR ముందు ఒక అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌పై వాదనలు విన్న పీపీవీఎఫ్‌ఆర్‌.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ ను రద్దు చేసింది. ‘‘అనేక మంది రైతులు కష్టాల్లో కూరుకుపోయారు, వారు చేస్తున్న ఉద్దేశ్య ఉల్లంఘనపై భారీ జరిమానా చెల్లించే అవకాశం ఉంది! ఇది కచ్చితంగా ప్రజా ప్రయోజనాలను ఉల్లంఘించడమే అవుతుంది’’ అన్న కవిత వాదనలతో పీపీవీఎఫ్‌ఆర్‌ ఏకీభవించింది. ‘రిజిస్ట్రేటర్లు తమ హక్కులు తెలుసుకోవాలి అలాగే రైతులనూ ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి వ్యవహారాల్లో హక్కులపై పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తి హక్కులుండవని చట్టంలో ఉంది. సీడ్‌ వెరైటీల మీద పేటెంట్లను చట్టం ఈ స్థాయిలో అనుమతించబోద’న్న విషయాన్ని గుర్తు చేశారు పీపీవీఎఫ్‌ఆర్‌ చైర్‌పర్సన్‌ కేవీ ప్రభు.

చదవండి: బతుకు రోడ్డు పాలు.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కోటీశ్వరుడయ్యాడు

మరిన్ని వార్తలు