చైనాలో మన సినిమా ఆడుతోంది

28 Sep, 2022 04:40 IST|Sakshi

ముంబై: భారతీయ సినిమాలు మన దేశంలో కంటే చైనాలో ఎక్కువగా ఆడుతున్నాయట. ‘అయిదారేళ్ల క్రితం భారత్‌లో 12,000 థియేటర్లు ఉండేవి. ఇప్పుడీ సంఖ్య 8,000లకు వచ్చి చేరింది. ఇదే సమయంలో చైనాలో సినిమా ప్రదర్శనశాలలు 10,000 నుంచి ఏకంగా 70,000లకు పెరిగాయి. అందుకే కొన్ని భారతీయ సినిమాలు ఇక్కడి కంటే మెరుగ్గా చైనాలో రాణిస్తున్నాయి’ అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఈ ట్రెండ్‌ను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరిన్ని థియేటర్లు ప్రారంభం కావడమే ఇందుకు పరిష్కారమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 10 లక్షల జనాభా ఉన్న మాల్డాలో ఒక్క థియేటర్‌ లేదని గుర్తుచేశారు.  

సరైన ధరలో సినిమా..
సినిమా ప్రదర్శనశాలలను తెరవాలనుకునే ఔత్సాహికుల కోసం ఫిల్మ్‌ ఫెసిలిటేషన్‌ ఆఫీస్‌ ప్రారంభించామని చంద్ర తెలిపారు. ‘ఇన్వెస్ట్‌ ఇండియాతోపాటు అనుమతులను సులభతరం చేసేందుకు నేషనల్‌ సింగిల్‌ విండో పోర్టల్‌ సాయంతో ఇది పనిచేస్తుంది. కర్నాటకలో జిల్లా కేంద్రాల్లో గడిచిన 3–4 నెలల్లో ఆరు థియేటర్ల ఏర్పాటుకు సాయం చేశాం. ‘రూ.75కు టికెట్‌’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. సినిమా సరైన ధరలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎగ్జిబిషన్‌ పరిశ్రమ కూడా ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని స్పష్టం చేశారు.  

నేరుగా మొబైల్‌లో..
5జీ నెట్‌వర్క్‌ రాకతో టీవీ ఛానెళ్లను నేరుగా మొబైల్‌కు ప్రసారం చేసే అవకాశం ఉంటుందని అపూర్వ చంద్ర అన్నారు. ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌ ఫోన్‌లో చిన్న పరికరాన్ని జోడించడం ద్వారా వందలాది ఛానెళ్లను వీక్షించడంపై ప్రసార భారతి ఇప్పటికే అమలు చేయదగ్గ భావనతో ముందుకు వచ్చిందని తెలిపారు.   

మరిన్ని వార్తలు