ఇండియా నుంచే ఆసియా తొలి ఫ్లయింగ్‌ కారు!

6 Oct, 2021 20:53 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు ఎగిరే కార్లను తయారు చేయడానికి సరికొత్త ఆవిష్కరణలు చేస్తుంటే. ఇప్పుడిప్పుడే మన దేశం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆసియాలో మిగిలిన దేశాలను వెనక్కి నెడుతు తొలి ఫ్లయింగ్‌ కారును మార్కెట్‌లోకి తెచ్చేందుకు మన వాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. లండన్‌లో అక్టోబర్ 5న జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద హెలిటెక్ ఎక్స్ పో - ఎక్సెల్ షోలో ఆసియాలోని మొట్టమొదటి హైబ్రిడ్ ఫ్లయింగ్ ప్రోటోటైప్ కారును చెన్నైకి చెందిన సంస్థ వినాటా ఏరోమొబిలిటీ ఆవిష్కరించింది. 

కంపెనీ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎగిరే కారు డిజిటల్ ప్రోటోటైప్ వీడియోను విడుదల చేసింది. ఈ కారులో రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. దీనిని నడిపే పక్కన మరో వ్యక్తి మాత్రమే కూర్చోవడానికి అవకాశం ఉంది. ఇది రెక్కల మాదిరిగా నిటారుగా తెరుచుకునే డోర్లను కలిగి ఉంటుంది. ఇతర విషయాలతో పాటు నావిగేషన్ కోసం భారీ డిజిటల్ టచ్ స్క్రీన్ వ్యవస్థ ఇందులో ఉంది. వినాటా ఏరోమొబిలిటీ రూపొందించిన ఫ్లైయింగ్‌ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు. ఇది గరిష్టంగా 1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు. గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగురగలదు. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. (చదవండి: రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త!)

భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్‌ కారు ప్రయాణిస్తుంది. వాలుగా కాకుండా నిట్టనిలువుగా ల్యాండింగ్‌, టేకాఫ్‌ అవడం ఈ కారు ప్రత్యేకత. ఈ హైబ్రిడ్‌ ఫ్లైయింగ్‌ కారులో బ్యాటరీలతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారు. కో యాక్సియల్‌ క్వాడ్‌ రోటార్‌ సిస్టమ్‌ ఆధారంగా ఈ కారు గాలిలో పైకి లేస్తుంది. ఒక సీటు పక్కన షాంపైన్ హోల్డర్ ఉంది. ఇప్పటికే కొరియాకు చెందిన హ్యుందాయ్‌ కంపెనీ సైతం ఏషియా నుంచి ఫ్లైయింగ్‌ కారు తయారీ చేసే పనిలో ఉంది.

మరిన్ని వార్తలు