గృహోపకరణాల పరిశ్రమ@ రూ.1.48 లక్షల కోట్లు

18 Nov, 2022 11:01 IST|Sakshi

2025 నాటికి చేరుకుంటుంది 

సీఈఏఎంఏ అంచనా 

మరిన్ని విభాగాలకు పీఎల్‌ఐ ప్రకటించాలి 

జీఎస్‌టీలో రేట్లలో మార్పులు చేయాలని డిమాండ్‌

న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ (ఏసీఈ) పరిశ్రమ వచ్చే మూడేళ్లలో రెట్టింపై రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ మండలి సీఈఏఎంఏ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌ పరిమాణం రూ.75 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. భారత్‌ వేగంగా వృద్ధి చెందుతున్న ఏసీఈ మార్కెట్లలో ఒకటని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగంజా తెలిపారు.

చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు భారత్‌ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా మారుతున్నట్టు చెప్పారు. 2021 మొత్తం మీద ఏసీఈ పరిశ్రమలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 198 మిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2022 జూన్‌ నాటికే రెట్టింపు స్థాయిలో 481 మిలియన్‌ డాలర్లు (రూ.3,888 కోట్లు) వచ్చినట్టు బ్రగంజా తెలిపారు. సీఈఏఎంఏ వార్షిక సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ సైతం పాల్గొన్నారు.  

తయారీ కేంద్రాల ఏర్పాటు.. 
ఇప్పుడు కొన్ని అంతర్జాతీయ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ కంపెనీలు (ఓఈఎం) భారత్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు బ్రగంజ చెప్పారు. ప్రభుత్వం ఏసీలకు సంబంధించి ప్రకటించిన పీఎల్‌ఐ పథకం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న, పెద్ద గృహోపకరణాలకు సంబంధించి ఇదే మాదిరి పీఎల్‌ఐ పథకాలను ప్రకటించినట్టయితే దేశీయంగా తయారీ మరింత ఊపందుకుంటుందని, మరింత మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఎరిక్‌ బ్రగంజ అభిప్రాయపడ్డారు. ‘‘ఇతర ఉత్పత్తుల విభాగాలకు సంబంధించి పీఎల్‌ఐ పథకం ప్రకటించాలని కోరుతున్నాం. ఇలా చేయడం వల్ల దేశంలో విడిభాగాల తయారీ వసతులు ఏర్పడతాయి. దీంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఆత్మనిర్భర భారత్‌ పిలుపునకు ఇది మద్దతుగా నిలుస్తుంది’’అని బ్రగంజ వివరించారు.  

వృద్ధికి భారీ అవకాశాలు
ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఏసీఈ పరిశ్రమలోని కొన్ని విభాగాలకు సంబంధించి భారత్‌లో విస్తరణ ఇంకా చిన్న స్థాయిలోనే ఉన్నట్టు బ్రగంజ చెప్పారు. కనుక వృద్ధికి భారీ అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘‘కరోనా వల్ల గత రెండు సంవత్సరాల్లో పరిశ్రమ వృద్ధిని చూడలేదు. ఇప్పుడు తిరిగి వృద్ధి బాటలోకి అడుగు పెట్టింది. ఈ ఏడాది వేసవిలో కంప్రెషర్‌ ఆధారిత కూలింగ్‌ ఉత్పత్తులు అధికంగా అమ్ముడయ్యాయి. పరిశ్రమ ఎంతో ఆశాభావంతో ఉంది. నూతన టెక్నాలజీని అందుపుచ్చుకుని, భారత్‌లో తయారీ కింద స్థానికంగా తయారు చేసేందుకు సుముఖంగా ఉంది.

కొన్ని స్టార్టప్‌లు సైతం పరిశ్రమకు విలువను తెచ్చిపెడుతున్నాయి’’అని బ్రగంజ వివరించారు. పరిశ్రమలో మధ్యస్థ, ఖరీదైన ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగినట్టు చెప్పారు. జీఎస్‌టీ విధానం కింద పన్నుల పరంగా పరిశ్రమకు ప్రోత్సాహం అవసరమన్నారు. టీవీలకు సంబంధించి స్క్రీన్‌ సైజుతో సంబంధం లేకుండా ఏకీకృత పన్ను రేటు ఉండాలన్న అభిప్రాయాన్ని వినిపించారు. ప్రస్తుతం 32 అంగుళాల టీవలపై 18 శాతం జీఎస్‌టీ ఉంటే, అంతకుపైన సైజుతో ఉన్న వాటిపై 28 శాతం జీఎస్‌టీ అమలవుతున్నట్టు చెప్పారు. విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలను 28 శాతం నుంచి 18 శాతం రేటు కిందకు తీసుకురావాలని కోరారు.

చదవండి: ఎలాన్‌ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్‌!

మరిన్ని వార్తలు