పెరుగుతున్న ఆర్థిక పొదుపులు

15 Dec, 2022 06:07 IST|Sakshi

జీడీపీలో 74 శాతానికి చేరతాయి

రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ నివేదిక

ముంబై: దేశంలో పొదుపు ఆర్థిక సాధనాల వైపు ప్రయాణిస్తోంది. ఈ ఆర్థిక పొదుపు 2026–27 నాటికి జీడీపీలో 74 శాతానికి చేరుకుంటుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. దీనిపై బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2021–22 నాటికి రూ.135 లక్షల కోట్లుగా ఉంటే, 2026–27 నాటికి రూ.315 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా వేసింది. విధాన నిర్ణేతలు దీర్ఘకాలంగా పొదుపు నిధులు ఆర్థిక సాధనాల్లోకి మళ్లాలని కోరుకుంటున్నట్టు గుర్తు చేసింది.

అంటే నగదు, బంగారం, రియల్‌ ఎస్టేట్‌ తదితర సాధనాలకు బదులు ప్రజలు మ్యూచువల్‌ ఫండ్స్, ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్, ఈక్విటీ, ఇతర పెట్టుబడి సాదనాల్లో తమ పొదుపు నిధులను ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా డెట్, ఈక్విటీ మార్కెట్లలో అధిక లిక్విడిటీ మొత్తం ఆర్థికీకరణ అజెండాకు సాయపడుతున్నట్టు క్రిసిల్‌ పేర్కొంది. అయితే ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ఎక్కువ కాలం పాటు అస్థిరతలు లేదా లిక్విడిటీ పరిస్థితులు ఇన్వెస్టర్ల అనుభవంపై ప్రభావం చూపించొచ్చని క్రిసిల్‌ హెచ్చరించింది.

మద్దతు చర్యలు..
అందరికీ ఆర్థిక సేవలు చేరువ కావడం, డిజిటలైజేషన్, దీర్ఘకాలంగా మధ్య తరగతి ప్రజల ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ఈ తరహా సాధనాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అన్నీ కలసి.. పొదుపు నిధులు ఆర్థిక సాధనాల వైపు మళ్లేందుకు దోహదపడినట్టు క్రిసిల్‌ వివరించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు పంపిణీపై దృష్టి సారించాలని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ జిజు విద్యాధరన్‌ సూచించారు. ఆయా ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు ప్రోత్సాహకాల అవసరాన్ని కూడా ప్రస్తావించారు. ఇన్వెస్టర్లు పెట్టుబడి సాధనాలను మరింత సరళంగా అర్థం చేసుకునేందుకు అన్నింటిపైనా ఒకే మాదిరి పన్ను విధానం ఉండాలన్నారు.

మరిన్ని వార్తలు