ఐటీ వృద్ధి 2.3 శాతం

16 Feb, 2021 05:31 IST|Sakshi
నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌

ఎగుమతులు 1.9 శాతం అప్‌

2020–21పై నాస్కామ్‌ అంచనాలు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయాలు 2.3 శాతం వృద్ధి చెంది 194 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. అలాగే ఎగుమతులు 1.9 శాతం పెరిగి 150 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ ఈ మేరకు అంచనాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఐటీ సంస్థలు నికరంగా నియామకాలు చేపట్టాయని తెలిపింది.

కొత్తగా 1.38 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 44.7 లక్షలకు చేరిందని పేర్కొంది. ‘కరోనా సంక్షోభం నుంచి దేశీ పరిశ్రమ మరింత పటిష్టంగా బైటిపడింది. కోవిడ్‌ ఎదుర్కొనడంలో చుక్కానిగా నిల్చింది‘ అని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ తెలిపారు. లిస్టెడ్‌ కంపెనీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం 15 బిలియన్‌ డాలర్ల దాకా విలువ చేసే కాంట్రాక్టులు కుదిరే అవకాశాలు ఉన్నట్లు ఘోష్‌ వివరించారు. 2021లో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు.. టెక్నాలజీపై వ్యయాలు మరింత పెంచుకోనున్నట్లు సీఈవోల సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు.

నాస్కామ్‌ సదస్సులో ప్రధాని ప్రసంగం..
బుధవారం జరిగే 29వ నాస్కామ్‌ టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఫోరం (ఎన్‌టీఎల్‌ఎఫ్‌) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి నుంచి బైటపడి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలు ప్రధానాంశంగా నాస్కామ్‌ దీన్ని నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 17 నుంచి 19 దాకా ఈ సదస్సు జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు