Tech layoffs: దేశీయ ఐటీ నిపుణులకు భారీ డిమాండ్‌

21 Mar, 2023 10:05 IST|Sakshi

అమెరికా తీసివేతలు దేశీయ ఐటీ రంగానికి లబ్ధి

గ్లోబల్‌లాజిక్‌ ప్రెసిడెంట్‌ నితేష్‌ బంగా వెల్లడి 

న్యూఢిల్లీ: అమెరికాలోని బడా టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలతో భారత ఐటీ సంస్థలకు గణనీయంగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని హిటాచీ గ్రూప్‌లో భాగమైన ఐటీ సంస్థ గ్లోబల్‌లాజిక్‌ ప్రెసిడెంట్‌ నితేష్‌ బంగా అభిప్రాయపడ్డారు. ఈ పరిణామంతో అమెరికా నుంచి భారత సంస్థలకు బోలెడంత పని బదిలీ కావచ్చని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తమ సంస్థ భారత్‌లో ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి పెడుతోందని, ఏటా సిబ్బంది సంఖ్యను 25 నుంచి 35 శాతం మేర పెంచుకోవాలని భావిస్తోందని బంగా పేర్కొన్నారు. ‘గూగుల్, ట్విటర్‌ లేదా ఫేస్‌బుక్‌ లేదా ఇతరత్రా అమెరికాలోని ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగిస్తున్నాయంటే, అవి పనులను నిలిపివేయాలని అనుకుంటున్నట్లుగా భావించరాదు. ఆయా కంపెనీలు ఇప్పటికీ తమ కార్యకలాపాలను కొనసాగించాల్సే ఉంటుంది. అందుకోసం నిపుణుల అవసరమూ ఉంటుంది. కాబట్టి అమెరికా నుంచి బోలెడంత పని భారత్‌కు రావచ్చు.

 (ఫ్లాగ్‌స్టార్‌ చేతికి సిగ్నేచర్‌ బ్యాంక్‌ డీల్‌ విలువ రూ. 22,300 కోట్లు )

అయితే, ఆయా సంస్థలు తమ ఖర్చుల విషయంలో బేరీజు వేసుకుని, తగు నిర్ణయం తీసుకుంటాయి‘ అని ఆయన తెలిపారు. తాము ప్రతి నెలా 1,000 మంది వరకూ రిక్రూట్‌ చేసుకుంటామని, వీరిలో 50 శాతం మంది భారత్‌లో ఉంటారని బంగా చెప్పారు. ఏటా ఈ సంఖ్య 25-35 శాతం మేర పెరుగుతోందన్నారు. గ్లోబల్‌లాజిక్‌ ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల్లో 2-3 ఏళ్ల అనుభవమున్న ఇంజినీర్లను రిక్రూట్‌ చేసుకుని, తమ కార్యకలాపాలకు అవసరమైన విధంగా వారికి డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణనిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 15,000 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. ఇది అంతర్జాతీయంగా గ్లోబల్‌లాజిక్‌కు ఉన్న సిబ్బందిలో సగం.

 (EPFO: పీఎఫ్‌ విత్‌ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు.. పెళ్లి కోసం కూడా!)


 

మరిన్ని వార్తలు