కొత్తగా 4.5 లక్షల కొలువులు..సానుకూలంగా రిక్రూట్‌మెంట్స్‌..!

16 Feb, 2022 08:15 IST|Sakshi

227 బిలియన్‌ డాలర్లకు ఐటీ

2021–22లో వృద్ధి 15.5 శాతం అప్‌ 

దశాబ్దకాలంలోనే అత్యధికం 

కొత్తగా 4.5 లక్షల కొలువులు నాస్కామ్‌ వెల్లడి 

ముంబై: కరోనా మహమ్మారి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా డిజిటైజేషన్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం 227 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. దశాబ్దకాలంలోనే అత్యధిక స్థాయిలో 15.5 శాతం వృద్ధి నమోదు చేయనుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వ్యూహాత్మక సమీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ మంగళవారం ఈ విషయాలు వెల్లడించింది.

మహమ్మారి పరిణామాలు తలెత్తిన వెంటనే పరిశ్రమ దీటుగా ఎదురునిల్చిందని, మరుసటి ఏడాది గణనీయంగా పుంజుకుందని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ పూర్వం కన్నా రెట్టింపు స్థాయి వృద్ధి సాధించనుందని ఆమె తెలిపారు. 2021 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయాలు 2.3 శాతం వృద్ధి చెంది 194 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వివరించారు. నాస్కామ్‌ ప్రకారం.. 2021–22లో కొత్తగా 4.5 లక్షల కొత్త కొలువులు రావడంతో ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య మొత్తం 51 లక్షలకు చేరనుంది. కొత్తగా రిక్రూట్‌ అయిన వారిలో 44 శాతం వాటాతో.. మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 18 లక్షలుగా చేరుతుంది. 

2026 నాటికి 350 బిలియన్‌ డాలర్లకు.. 
కొన్నాళ్లుగా వృద్ధి అంచనాలను ప్రకటించడాన్ని నిలిపివేసిన నాస్కామ్‌.. తాజా పరిణామాల దన్నుతో దేశీ ఐటీ పరిశ్రమ 2026 నాటికి 350 బిలియన్‌ డాలర్లకు చేరగలదని ధీమా వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన సామర్థ్యాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఘోష్‌ పేర్కొన్నారు. దీనికోసం విధానకర్తలు కూడా కొంత తోడ్పాటు అందించాలని కోరారు. తొలి 100 బిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించడానికి పరిశ్రమకు 30 ఏళ్లు పట్టగా, రెండో బిలియన్‌ డాలర్ల మార్కును దశాబ్దకాలంలోనే సాధించినట్లు ఆమె తెలిపారు. మరోవైపు, ఐటీ పరిశ్రమ వృద్ధిని స్వాగతించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌..పరిశ్రమకు అవసరమైన పూర్తి మద్దతును ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. 

ఎగుమతులు 17 శాతం అప్‌.. 
నాస్కామ్‌ ప్రకారం.. సమీక్షా కాలంలో ఎగుమతి ఆదాయాలు 17.2 శాతం పెరిగి 178 బిలియన్‌ డాలర్లకు చేరనుండగా, దేశీయంగా ఆదాయాలు 10 శాతం వృద్ధితో 49 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. కీలక విభాగాల వారీగా చూస్తే.. సైబర్‌సెక్యూరిటీ, ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్, అనలిటిక్స్‌కు డిమాండ్‌ నేపథ్యంలో ఐటీ సర్వీసుల ఆదాయం 16.9 శాతం, సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల వృద్ధి అత్యధికంగా 18.7 శాతం, హార్డ్‌వేర్‌ అత్యంత తక్కువగా 7.3 శాతంగా నమోదు కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వృద్ధి జోరు కొనసాగుతుందని సీఈవోలు ఆశావహంగా ఉన్నట్లు నాస్కామ్‌ సర్వేలో తేలింది. ఫార్మా/హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు, బీమా, తయారీ, రిటైల్‌/ఈ–కామర్స్‌ మొదలైన రంగాల కంపెనీల ఐటీ వ్యయాలు ఎక్కువగా ఉండగలవని సీఈవోలు అభిప్రాయపడ్డారు. అలాగే, 2022–23లోనూ రిక్రూట్‌మెంట్‌పై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు.  

గరిష్ట స్థాయికి అట్రిషన్‌.. 
అట్రిషన్‌ సమస్య గరిష్ట స్థాయికి చేరిందని, ఇక నుంచి క్రమంగా తగ్గగలదని  నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌ కృష్ణన్‌ రామానుజం తెలిపారు. టాప్‌ 10 ఐటీ కంపెనీల డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలు చూస్తే ఉద్యోగుల వలసలు.. మరీ తగ్గకపోయినప్పటికీ, ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘ఇది గరిష్ట స్థాయికి చేరి ఉంటుందని, ఇక నుంచి పరిస్థితులు మెరుగుపడగలవని ఆశాభావం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు. ప్రతిభావంతులు చేజారిపోకుండా చూసుకోవడం ఇటు పరిశ్రమకు అటు దేశానికి ముఖ్యమని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ పేర్కొన్నారు. ఇందుకోసం కంపెనీలు, నాస్కామ్‌ కూడా పలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఇటీవల కొన్ని త్రైమాసికాల్లో అట్రిషన్‌ ఏకంగా 20 శాతం పైగా నమోదైన నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

చిన్న పట్టణాల్లో మైక్రో ఐటీ హబ్‌లు.. 
బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాలకు పరిమితమైన ఐటీ కార్యకలాపాలను చిన్న పట్టణాలకు కూడా విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఘోష్‌ చెప్పారు. ఇండోర్, జైపూర్, కోల్‌కతా, కోయంబత్తూర్, అహ్మదాబాద్‌ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి సెంటర్లలో మైక్రో ఐటీ హబ్‌లు ఏర్పాటయ్యాయని ఆమె వివరించారు. చిన్న పట్టణాలకు ఐటీ మరింతగా విస్తరించాలంటే నిరంతర విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు నిపుణుల లభ్యత, తగినంత ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి ఉండాలని ఘోష్‌ తెలిపారు.      

చదవండి: జనవరిలో ఎగుమతుల్లో 25% వృద్ధి 

మరిన్ని వార్తలు