ఐటీ సేవల జోరు.. నెమ్మది

9 Feb, 2023 04:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధి వేగం.. స్వల్పకాలికం నుంచి మధ్యకాలికంగా మందగించనుంది. ప్రతికూల స్థూలఆర్థిక పరిస్థితుల కారణంగా కంపెనీలు ఐటీపరంగా అవసరమైనవైతే తప్ప మిగతా వ్యయాలను తగ్గించుకోనుండటమే ఇందుకు కారణం. రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు అధిక స్థాయిలో రిక్రూట్‌ చేసుకున్నందున సమీప భవిష్యత్తులో హైరింగ్‌ కూడా తగ్గవచ్చని పేర్కొంది.

స్థూలఆర్థిక ప్రతికూలతల కారణంగా గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే డిమాండ్‌ ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని వివరించింది. బేస్‌ ఎఫెక్ట్, కీలకమైన అమెరికా, యూరప్‌ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల వల్ల దేశీ ఐటీ సరీ్వసుల సంస్థల వృద్ధి కొంత నెమ్మదించింది. ఇక్రా ప్రకారం.. 

►  వేతనాల ఖర్చులు పెరగడం తదితర అంశాల వల్ల నిర్వహణ లాభాల మార్జిన్లు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కానున్నాయి. 
► ఐటీకి కీలకమైన విభాగాల్లో ఒకటైన .. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బీమా) సెగ్మెంట్‌ ఇటీవలి కాలంలో మిగతా విభాగాలతో పోలిస్తే కాస్త మందగించింది. రుణ లావాదేవీలు నెమ్మదించడం ఇందుకు కొంత కారణం. స్థూలఆర్థిక సవాళ్లు కొనసాగిన పక్షంలో తయారీ, హెల్త్‌కేర్‌ సెగ్మెంట్లతో పోలిస్తే తనఖా రుణాలు, రిటైల్‌ సెగ్మెంట్లలో వృద్ధి మరింతగా నెమ్మదించవచ్చు. 
►  కొన్నాళ్లుగా భారీ అట్రిషన్‌ (ఉద్యోగుల వలసలు) రేటుతో పరిశ్రమ సతమతమవుతోంది. ప్రధానంగా డిజిటల్‌ టెక్నాలజీ నిపుణులు డిమాండ్‌కు తగ్గ స్థాయిలో దొరకడం లేదు. అయితే, గత రెండు త్రైమాసికాలుగా అట్రిషన్‌ తగ్గుముఖం పడుతోంది. వచ్చే రెండు–మూడు క్వార్టర్లు ఇదే ధోరణి కొనసాగవచ్చని, ఆ తర్వాత కాస్త స్థిరపడవచ్చని ఇక్రా అంచనా వేసింది. 
►  వృద్ధి వేగం మందగించవచ్చని భావిస్తున్నప్పటికీ దేశీ ఐటీ సర్వీసుల పరిశ్రమ అంచనాలపై ఇక్రా స్టేబుల్‌ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తోంది. డిజిటల్‌..క్లౌడ్‌ సేవలు సహా ఐటీ సరీ్వసులకు డిమాండ్‌ పెరుగుతుండటం, మన కంపెనీలు దీటుగా పోటీపడగలగడం, కంపెనీల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం.  

మరిన్ని వార్తలు