ఏప్రిల్‌లో నియామకాల జోరు

10 May, 2022 06:14 IST|Sakshi

15 శాతం అప్‌ :  మాన్‌స్టర్‌ ఇండియా

ముంబై: వ్యాపార సెంటిమెంట్‌ మెరుగుపడుతున్న నేపథ్యంలో నియామకాలకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో హైరింగ్‌ 15% పెరిగింది. మాన్‌స్టర్‌ ఇండియా తమ పోర్టల్‌లో నమోదయ్యే ఉద్యోగాల వివరాలను విశ్లేషించి, రూపొందించే మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సూచీ (ఎంఈఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో (బీఎఫ్‌ఎస్‌ఐ) నియామకాలు అత్యధికంగా 54% వృద్ధి చెందాయి. కోవిడ్‌ మహమ్మారితో కుదేలైన రిటైల్‌ రంగంలో హైరింగ్‌ రెండంకెల స్థాయి వృద్ధితో గణనీయంగా కోలుకుంది. 47% పెరిగింది. అలాగే తయారీ రంగం, ట్రావెల్‌ .. టూరిజం, ఎగుమతులు.. దిగుమతులు మొదలైన విభాగాలు కూడా మెరుగుపడ్డాయి. రెండేళ్ల తర్వాత మళ్లీ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. తయారీ రంగంలో నియామకాలు 35% మేర పెరిగాయి.  

ఆంక్షల సడలింపుతో రిటైల్‌కు ఊతం..
బీఎఫ్‌ఎస్‌ఐలో ఉద్యోగాల కల్పన యథాప్రకారంగానే కొనసాగుతుండగా, పలు భౌతిక స్టోర్స్‌ తిరిగి తెరుచుకోవడంతో రిటైల్‌ రంగంలోనూ నియామకాలు గణనీయంగా పెరిగాయి. ప్రథమ శ్రేణి నగరాల్లో హైరింగ్‌ జోరుగా ఉండగా, ద్వితీయ శ్రేణి మార్కెట్లో నియామకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ముంబైలో హైరింగ్‌ డిమాండ్‌ అత్యధికంగా 29% స్థాయిలో నమోదైంది. కోయంబత్తూర్‌ (25% అప్‌), చెన్నై (21%), బెంగళూరు (20%), హైదరాబాద్‌ (20%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు