తయారీ రంగానికి తలనొప్పి.. కారణాలు ఇవే!

20 Aug, 2022 11:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతి వృద్ధి కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) మంచి ఫలితాలను సాధించిన భారతీయ తయారీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2022–23)లో మాత్రం కొంత వెనక్కు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో విదేశీ వాణిజ్య కార్యకలాపాల మందగమనం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. పారిశ్రామిక ఉత్పత్తి, వస్తువుల ఎగుమతులపై రూపొందిన ఈ  నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
►   2021–22లో సరుకుల ఎగుమతుల్లో కనిపించిన ‘‘అత్యుత్సాహం’’ తయారీ విభాగాలకు తోడ్పాటును అందించింది. అయితే 2022–23లో ఇలాంటి పరిస్థితి కనబడ్డం లేదు.  
► ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రతికూల ప్రభావం 2022–23 ఎగుమతుల ధోరణిపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది.  యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలతో మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుంచి డిమాండ్‌ తగ్గే వీలుంది. ఇది భారత్‌ ఎగుమతులపై ప్రభావం చూపుతుంది.  


► దీనికితోడు చైనాలో కఠిన కోవిడ్‌–19 నియంత్రణ చర్యలు భారతదేశంలోని వివిధ ఉప రంగాలలో ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఆయా అంశాలు,  ప్రపంచ సరఫరాల వ్యవస్థపై నిరంతరం ప్రతికూలతలు సృష్టించే వీలుంది.  
►  2015–16 నుంచి 2017–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతదేశ సగటు వార్షిక సరుకుల ఎగుమతులు 297.02 బిలియన్‌ డాలర్లు. 2018–19లో 330.08 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరగ్గా, 2021–22లో  ఈ విలువ 421.89 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత్‌ ఎగుమతుల పెరుగుదల్లో తయారీ రంగం కీలక భాగస్వామిగా నిలిచింది.  
►  2021–22లో ఎగుమతుల రంగం ఎంతో పటిష్టంగా కనిపించింది. ప్రాథమిక లోహాలు, వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఎంతో మెరుగుదల కనిపించింది. అయితే ప్రస్తుత పరిస్థితిల్లో  అనిశ్చితి నెలకొంది.  


►  ఎగుమతులు జూలైలో స్వల్ప స్థాయిలో 2.14 శాతం  పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయినట్లు ఆగస్టు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే తరువాత వెలువడిన సవరిత గణాంకాలు కొంత ఊరటనిచ్చాయి.  
► ఇక ఎకానమీకి ప్రస్తుతం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటుపైతం తీవ్ర సవాళ్లను తెస్తోంది. 2021 జూలైతో పోల్చితే 2022 జూలైలో వాణిజ్యలోటు మూడు రెట్లు పెరిగి 30 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (జూలై వరకూ) వాణిజ్యలోటు దాదాపు 99 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

చదవండి: బ్రిటన్‌ వెళ్లే భారతీయలుకు శుభవార్త.. ఓ సమస్య తీరింది!

మరిన్ని వార్తలు