హిండెన్‌బర్గ్ - అదానీ వివాదం : అషిమా గోయల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

15 Mar, 2023 10:50 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మార్కెట్లు మరింత బలంగా, వైవిధ్యంగా మారాయని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యురాలు అషిమా గోయల్‌ అన్నారు. ఇవి అదానీ గ్రూపు అంశాన్ని సాఫీగా సర్దుబాటు చేసుకున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర సంస్థలకు వ్యాపించలేదని లేదా సంక్షోభంగా మారలేదని గుర్తు చేశారు. నియంత్రణ సంస్థలు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను కఠినతరం చేశాయని, అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. విడిగా గ్రూపులకు సంబంధించి ప్రభుత్వానికి ఆందోళన లేదన్నారు.

జనవరి 24న అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. విదేశాలకు అక్రమ మార్గాల్లో డబ్బులు తరలించి, షెల్‌ కంపెనీల ద్వారా ఇక్కడ అదానీ గ్రూపు షేర్ల ధరలను కృత్రిమంగా పెంచినట్టు ఆరోపించింది. ఖాతాల్లోనూ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసింది. వీటిని అదానీ గ్రూపు ఖండించింది.

భారత్‌కు చెందిన బడా కార్పొరేట్లు విదేశీ నిధులు సమీకరిస్తుండడంతో, విదేశీ అనలిస్టుల వైపు నుంచి వాటి ఖాతాలపై సునిశిత పరిశీలన ఉంటుందని గోయల్‌ చెప్పారు. ‘‘భారతీయ సంస్థలు ఇప్పటికీ సంక్లిష్టమైన నిర్మాణాలను కలిగి ఉన్నాయి. దీంతో పారదర్శకత లోపిస్తోంది. ఫలితంగా హిండెన్‌బర్గ్‌ వంటి సంస్థలకు అవకాశాలు కల్పిస్తోంది.’’అని గోయల్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు