పట్టణాల్లో గ్యాస్‌ పంపిణీ, కేంద్ర ప్రభుత్వ సంస్థతో పోటీ పడుతున్న అదానీ

24 Dec, 2021 08:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని చమురు దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), దేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ టోటల్‌ గ్యాస్‌.. పట్టణ గ్యాస్‌ పంపిణీ లైసెన్స్‌ల్లో అత్యధిక ప్రాంతాలకు బిడ్లు దాఖలు చేశాయి. 11వ విడత గ్యాస్‌ లైసెన్సింగ్‌లో భాగంగా 61 భౌగోళిక ప్రాంతాలకు (జీఏ) లైసెన్స్‌ల కోసం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. బిడ్ల వివరాలను పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) గురువారం విడుదల చేసింది. 

అదానీ టోటల్‌ గ్యాస్‌లో అదానీ, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌కు సమాన వాటా ఉంది.  61జీఏలకు గాను ఐవోసీ 53 ప్రాంతాలకు బిడ్లు దాఖలు చేసింది. అదానీ టోటల్‌ గ్యాస్‌ 52 జీఏలకు బిడ్‌ వేసింది.  పట్టణ గ్యాస్‌ పంపిణీలో ఐవోసీతో కలసి అదానీ టోటల్‌ గ్యాస్‌కు జాయింట్‌ వెంచర్‌ కూడా ఉంది. కానీ, ఈ విడతలో అదానీ–ఐవోసీ సంయుక్తంగా బిడ్లు వేయలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జీఏలకు ఒక్క బిడ్‌ కూడా రాలేదు. ఐస్క్వేర్డ్‌ క్యాపిటల్‌కు చెందిన థింక్‌ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ 44జీఏలకు బిడ్లు వేసింది. భారత్‌ పెట్రోలియం 43 జీఏలకు, గెయిల్‌కు చెందిన గెయిల్‌గ్యాస్‌ 30 ప్రాంతాలకు, హెచ్‌పీసీఎల్‌ 37జీఏలకు బిడ్లు సమర్పించింది.

ఐవోసీ రూ. 9,028 కోట్ల పెట్టుబడులు 
ఐవోసీ తాజాగా గుజరాత్‌లోని ముంద్రా నుంచి హర్యానాలోని పానిపట్‌ వరకూ క్రూడాయిల్‌ పైప్‌లైన్‌ నిర్మించనుంది. ఇందుకోసం రూ.9,028 కోట్లు వెచ్చిం చనుంది. దిగుమతి చేసుకున్న క్రూడాయిల్‌ను గుజరాత్‌ తీరం నుంచి హర్యానాలో ఉన్న తమ రిఫైనరీకి తరలించడానికి ఈ పైప్‌లైన్‌ ఉపయోగపడుతుందని ఐవోసీ తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద ముంద్రాలో ఒక్కోటి 60,000 కిలోలీటర్ల సామర్థ్యం ఉండే 9 క్రూడాయిల్‌ ట్యాంకులను కూడా ఐవోసీ నిర్మించనున్నట్లు ఐవోసీ వివరించింది. నిర్వహణ అవసరాలతో పాటు దేశీయంగా ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది.

చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్‌ ఇచ్చిన గౌతమ్‌ అదానీ

మరిన్ని వార్తలు