ఐవోసీ పైప్‌లైన్‌ ఆస్తుల విక్రయం!

3 Feb, 2021 01:19 IST|Sakshi

14,600 కిలోమీటర్ల పైప్‌లైన్‌ ప్రాజెక్టులు 

న్యూఢిల్లీ: ముడిచమురు, పెట్రోలియం ప్రొడక్టుల పైప్‌లైన్లలో ఒకటి లేదా రెండింటిలో మైనారిటీ వాటాను విక్రయించే వీలున్నట్లు పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. అయితే నియంత్రిత వాటాను విక్రయించబోమని స్పష్టం చేశారు. ఆస్తుల విక్రయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(ఇన్విట్‌)ను ఒక మార్గంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. పైప్‌లైన్‌ మానిటైజేషన్‌ చేపట్టినప్పటికీ నిర్వాహక కంపెనీగా కొనసాగనున్నట్లు వివరించారు.

ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజాలు ఐవోసీ, గెయిల్‌ ఇండియా, హెచ్‌పీసీఎల్‌కు చెందిన పైప్‌లైన్‌ ప్రాజెక్టులలో వాటాల విక్రయానికి తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన విషయం విదితమే. తమకుగల భారీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు గుప్తా చెప్పారు. వెరసి కంపెనీ ఆస్తులకు తగిన విలువ లభించగలదని అభిప్రాయపడ్డారు. ఐవోసీ 14,600 కిలోమీటర్లకుపైగా పైప్‌లైన్లను కలిగి ఉంది. తద్వారా ముడిచమురును రిఫైనరీలు, ఇంధనంగా వినియోగించే కంపెనీలకు రవాణా చేస్తుంటుంది. కంపెనీ నిర్వహణలో ఇవి కీలకంకావడంతో మైనారిటీ వాటాలు మాత్రమే విక్రయించనున్నట్లు గుప్తా తెలియజేశారు.  

>
మరిన్ని వార్తలు