డిజిటల్‌ వద్దు క్యాషే ముద్దు

15 Oct, 2021 08:09 IST|Sakshi

నగదు చెల్లింపులకే ప్రజల మొగ్గు..

విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ నివేదిక  

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావాలతో డిజిటల్‌ చెల్లింపుల విధానాలకు మారినా, ఇప్పటికీ దేశీయంగా ప్రజలు ఎక్కువగా నగదు చెల్లింపుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు పేమెంట్‌ అండ్‌ సెటిల్మెంట్‌ సిస్టమ్స్‌ చట్టం, 2007 (పీఎస్‌ఎస్‌)ను పునఃసమీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ (వీసీఎల్‌పీ) ఒక నివేదికలో ఈ అంశాలు పేర్కొంది. 

భారత్‌లో డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌ ఇంకా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు దాదాపు దశాబ్దకాలం క్రితం పేమెంట్స్‌ వ్యవస్థల నియంత్రణ కోసం పీఎస్‌ఎస్‌ చట్టం చేశారని నివేదిక తెలిపింది. మారుతున్న పరిస్థితులను బట్టి నియంత్రణ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ మధ్యమధ్యలో పలు మార్గదర్శకాలు చేస్తున్నప్పటికీ, ఇవి సరిపోవని వివరించింది. రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందేందుకు, దీనికి సంబంధించిన చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని వీసీఎల్‌పీ తెలిపింది.
 

>
మరిన్ని వార్తలు