కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం కష్టమే: సర్వేలో షాకింగ్‌ విషయాలు

22 Sep, 2022 07:17 IST|Sakshi

78 శాతం మంది నిపుణుల అభిప్రాయం

ఈవై సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: అస్థిరతలు, సవాళ్లతో కూడిన మార్కెట్‌ పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఇంటిగ్రిటీని (కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం/ఆచరణ సాధ్యత) కొనసాగించడం కష్టమని 78 శాతం మంది భారత నిపుణులు భావిస్తున్నారు. 34 వర్ధమాన దేశాల నుంచి 2,750 మంది బోర్డు సభ్యులు, మేనేజర్లు, ఉద్యోగుల అభిప్రాయాలను ఈవై తన సర్వే కోసం తీసుకుంది. ఇందులో భారత్‌ నుంచి 100 మంది ఉన్నారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే మన దేశ సంస్థలు నియంత్రణ సంస్థల నుంచి ఎక్కువ చర్యలను ఎదుర్కొంటున్నాయి.

ఇంటెగ్రిటీ ప్రమాణాలను ఉల్లంఘించినందుకు తమపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకున్నట్టు మన దేశం నుంచి 60 శాతం కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఇతర వర్ధమాన దేశాల నుంచి ఇలా చెప్పిన వారు 38 శాతమే ఉన్నారు. మారుతున్న నిబంధనలను వేగంగా అమలు చేయడం కష్టంగా ఉన్నట్టు భారత్‌లో 65 శాతం మంది చెప్పారు. వర్ధమాన దేశాల నుంచి ఇలా చెప్పిన కంపెనీలు 45 శాతంగానే ఉన్నాయి.

భారత స్టార్టప్‌లు పెరుగుతున్న కొద్దీ.. నియంత్రణపరమైన నిబంధనల అమలు పెంచడానికి మరింత సమయం తీసుకోవచ్చని ఈవై ఇండియా గ్లోబల్‌ మార్కెట్స్‌ లీడర్‌ అర్పిందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇక మన దేశంలోనే ఎక్కువ కంపెనీలు ఈఎస్‌జీ దిశగా అడుగులు వేస్తున్నాయి. 47 శాతం కంపెనీలు తాము కార్పొరేట్‌ సామాజిక బాధ్యత లేదా ఈఎస్‌జీ విధానం కలిగి ఉన్నట్టు చెప్పాయి. వర్ధమాన దేశాల నుంచి కేవలం 33 శాతం కంపెనీలు ఇలా చెప్పాయి.

చదవండి: మూన్‌లైటింగ్‌: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు

మరిన్ని వార్తలు