Indian Railway: ఆ ఒక్క నిర్ణయంతో రూ.2800 కోట్ల ఆదాయం - కేవలం ఏడేళ్లలో..

21 Sep, 2023 09:41 IST|Sakshi

ఇండియన్ రైల్వే దినదినాభివృది చెందుతున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే కొత్త ట్రైన్లు ప్రారంభించడమే కాకుండా కొత్త కొత్త సర్వీసులను కూడా అందిస్తోంది. అయితే ఇటీవల రైల్వే ఆదాయానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వే గత ఏడు సంవత్సరాలలో పిల్లల టికెట్లు (చైల్డ్ ట్రావెలర్స్) విక్రయించి ఏకంగా రూ. 2800 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందినట్లు తెలుస్తోంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ. 560 కోట్లు ఆర్జించినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్‌ఐఎస్) వెల్లడించింది.

ట్రైన్‌లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్త్‌లు లేదా రిజర్వ్ కోచ్‌లో సీట్లు ఎంచుకోవచ్చు. అలాంటి వారు సాధారణ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం 2016 ఏప్రిల్ 21 నుంచి అమలులోకి వచ్చింది.

అంతకు ముందు రైల్వేలో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్తులు అందించే వారు. ఆ సమయంలో సగం చార్జీలే వసూలు చేసేవారు. ఈ నియమాలు సవరించిన తరువాత రైల్వే మరింత లాభాలను ఆర్జించడం మొదలుపెట్టింది.

ఇదీ చదవండి: బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్‌ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే?

2016 - 17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 - 23 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు 3.6 కోట్లమంది పిల్లలు రిజర్వ్‌డ్ సీటు లేదా కోచ్‌ ఎంచుకోకుండా సగం చార్జీల మీద ప్రయాణిస్తే.. 10 కోట్లమంది పిల్లలు ప్రత్యేక బెర్త్/సీటును ఎంచుకుని పూర్తి చార్జీలు చెల్లించినట్లు తెలిసింది. మొత్తం మీద సుమారు 70 శాతం మంది పూర్తి చార్జీలు చెల్లించి బెర్త్ పొందటానికి ఇష్టపడుతున్నట్లు చంద్ర శేఖర్ గౌర్ తెలిపారు.

మరిన్ని వార్తలు