ట్రైన్‌ జర్నీ వాయిదా, తేదీని మార్చుకోవాలా?.. ఇలా చేస్తే క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఉండవు!

6 Jan, 2023 16:54 IST|Sakshi

ప్రజలు సాధారణంగా ఫలానా తేదీన ట్రైన్‌ జర్నీఅనుకున్నప్పుడు టికెట్లను ముందుగానే రిజర్వేషన్‌ చేసిపెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు అనుకున్న ప్రయాణ తేదీని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అనగా మందనుకున్న ప్రయాణం తేదీని ముందుగా లేదా తర్వాత రోజులకు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. గతంలో అయితే ఈ తరహా ఘటనలు ఎదురైతే టికెట్‌ రద్దు (క్యాన్సిల్‌) చేసుకోవాలి. అందువల్ల రైల్వే శాఖ క్యాన్సిలేషన్‌ ఛార్జిని మినహాయించుకుని మిగిలిన నగదును మాత్రమే ప్రయాణికుడికి ఇస్తుంది.

ఇలా చేయడం వల్ల ప్యాసింజర్‌ కొంత డబ్బును నష్టపోవాల్సి ఉంటుంది. ఇటీవల దీనికి పరిష్కారంగా భారతీయ రైల్వే కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రయాణికుడికి ఏ నష్టం రాకుండా ప్రయాణా టికెట్‌ను మార్చుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం కేవలం ఆఫ్‌లైన్ టిక్కెట్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇ-టికెటింగ్ విభాగం ఆన్‌లైన్ బుకింగ్ తేదీని మార్చుకునే సదుపాయం లేదు.

క్యాన్సిల్‌ చేసిన.. ఛార్జీలు పడవు కావు
తెరపైకి వచ్చిన కొత్త సేవలో.. ప్యాసింజర్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణ తేదీని మార్చుకునే వెసలుబాటు ఉంది. అది కూడా క్యాన్సిలేషన్‌ ఛార్జీలు లేకుండానే ఆ టికెట్లను రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం  మనం చేయాల్సిందల్లా ... మనం ముందుగా బుక్‌ చేసుకున్న రైలు ప్రయాణం ప్రారంభమయ్యే కనీసం 48 గంటల ముందే రిజర్వేషన్‌ కౌంటర్‌కు (పనివేళల్లో) వెళ్లి మీ టికెట్‌ను సంబంధిత రైల్వే ఉద్యోగికి సరెండర్‌ చేయాలి. అదే సమయంలో మీరు ఏ రోజున ఏ సమయంలో ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకున్నారో రిజర్వేషన్‌ కౌంటర్‌లోని ఉద్యోగులకు తెలియజేయాలి. అంతేకాకుండా ఇందులో మరో సౌకర్యం ఏమనగా.. ఆ సమయంలో ప్యాసింజర్లు ప్రయాణపు తరగతిని కూడా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు.

రిజర్వేషన్‌ కౌంటర్‌ అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి మీరు కోరిన రోజున ప్రయాణానికి అందుబాటులో ఉంటే  సర్దుబాటు చేస్తారు. ఇందుకోసం అదనపు ఛార్జీలు తీసుకోరు. మీ కోచ్‌ తరగతిని అప్‌గ్రేడ్‌ చేసుకోవాలనుకుంటే అందుకు తగిన టికెట్‌ ధరను మాత్రం తీసుకుంటారు. ఈ సదుపాయం కన్ఫర్మ్‌ టికెట్‌ ఉన్నవారితో పాటు, ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారు సైతం ఒకసారి ఉపయోగించుకోవచ్చు.

బోర్డింగ్‌ స్టేషన్‌నూ మార్చుకోవచ్చు..
ప్రయాణికులు ఒరిజినల్ బోర్డింగ్ స్టేషన్‌లోని స్టేషన్ మేనేజర్‌కి వ్రాతపూర్వక అభ్యర్థనను సమర్పించడం ద్వారా లేదా ఏదైనా కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా బోర్డింగ్ స్టేషన్‌ను మార్చవచ్చు. అయితే అందుకోసం రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు సమాచారం తెలపాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్‌లైన్ టిక్కెట్‌లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

చదవండి : భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు