రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే!

9 Jan, 2023 09:36 IST|Sakshi

రాత్రిపూట రైళ్లలో నిద్రించే వారికి ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవలు ఈ సమయంలో ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ఐఆర్‌టీసీ (IRCTC) కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చిన్న మార్పులను నిబంధనలను పాటించకపోతే ప్యాసింజర్లు ఇబ్బందుల్లో పడినట్లే. అవేంటో ఓ సారి తెలుసుకుందాం!

కొత్త నిబంధనలు ఇవే
మీ కంపార్ట్‌మెంట్ లేదా కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, తోటి ప్యాసింజర్లు ఫోన్‌ కాల్‌లో గట్టిగా మాట్లాడటం, లేదా పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, లేదా బిగ్గరగా అరవడం లాంటివి చేస్తుంటారు.

గతంలో మన రైల్వే ప్రయాణంలో ఇలాంటి ఘటనలు చూసే ఉంటాం కూడా. అయితే ప్యాసింజర్లు ఎదర్కుంటున్న ఈ సమస్యకు రైల్వే శాఖ చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది. రైలులో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి నిద్రకు భంగం కలగకుండా, ప్రయాణంలో ప్రశాంతంగా నిద్రించేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

మీడియా నివేదికల ప్రకారం.. ఇకపై రైలులో ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. వాటి ప్రకారం ఆ ప్రయాణంలో ప్రయాణికులు బిగ్గరగా మాట్లాడడం, పెద్దగా సంగీతం వినడం, అరవడం లాంటివి కూడా చేయకూడదు.

మొత్తానికి తోటి ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకూడదు. ఒక వేళ ఎవరైన ఈ రూల్స్‌ని పాటించకపోతే ప్రయాణికులెవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దీని పరిష్కరించాల్సిన బాధ్యత రైలులో ఉన్న సిబ్బందిపైనే ఉంటుంది.

చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్‌ జియో.. ఆ కస్టమర్లకు పండగే!

మరిన్ని వార్తలు