రైలు ప్రయాణంలో ఎక్కువ లగేజీ తీసుకురావొద్దు!

9 Jun, 2022 13:04 IST|Sakshi

రైల్వేశాఖ తాజాగా జారీ చేసిన ఓ ప్రకటన ప్రయాణికులను ఆయోమయానికి గురి చేసింది. అంతేకాదు అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ప్రకటన రైల్వేపై విమర్శలకు తావిచ్చింది. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ నష్టనివారణ చర్యలకు దిగింది.

ఎక్కువ లగేజీ వద్దు
ఇటీవల రైల్వేశాఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వినూత్న ప్రచారానికి తెర లేపింది. రైలు ప్రయాణంలో అవసరానికి మించి లగేజీ తెచ్చుకోవద్దంటూ సూచించింది. లగేజీ ఎక్కువైతే ప్రయాణంలో ఆనందం ఆవిరవుతుందంటూ వివరించింది. లగేజీ పరిమిత స్థాయికి మించి ఉంటే రైల్వే పార్శిల్‌ సర్వీసును ఉపయోగించుకోవాలంటూ కోరింది.

లగేజీకి ఛార్జ్‌?
కేంద్రం ఇప్పటికే ప్రైవేటీకరణ బాట పట్టడం. రైల్వేలో కూడా ప్రైవేటీకరణ మొదలవడంతో తాజా ప్రచారం అనేక సందేహాలకు తావిచ్చింది. దీనికి తోడు కోవిడ్‌ సమయంలో రద్దు చేసిన పలు రాయితీలు, ప్యాసింజర్‌ రైళ్లను ఇప్పటికీ రైల్వేశాఖ పునరుద్ధరించ లేదు. దీంతో విమాన సర్వీసుల తరహాలో లగేజీ ఎక్కువగా ఉంటే అదనపు ఛార్జ్‌ చేస్తారనే అపోహలు ప్రజల్లో ఏర్పాడ్డాయి. రైల్వే ప్రకటనపై పలు మీడియా సంస్థలు కూడా ఇదే తరహాలో వార్తలు ప్రచురించాయి.

పాత పద్దతే
రైలు ప్రయాణంలో లగేజీకి కూడా ఛార్జ్‌ వసూలు చేయాలనే ఆలోచన బాగాలేదంటూ రైల్వేపై విమర్శలు పెరిగాయి. దీంతో తమ ప్రచార యత్నం పట్టాలు తప్పిందని రైల్వేశాఖ గ్రహించింది. వెంటనే తామేమీ కొత్త విధానాలను అమలు చేయడం లేదని. గత పదేళ్ల నుంచి అమల్లోఉన్న పద్దతులనే ప్రజలకు తెలియజేశామంటూ మరో వివరణ ఇచ్చింది. 

చదవండి: ఎవ్వరినీ వదలం.. రాయితీలు ఇవ్వం.. లాభాలే ముఖ్యం

మరిన్ని వార్తలు