మూడోరోజూ..రూపాయి ‘బాహుబలి’

6 Apr, 2022 09:06 IST|Sakshi

ముంబై: రూపాయి విలువ వరుసగా మూడోరోజూ బలపడింది. డాలర్‌ మారకంలో 24 పైసలు ఎగసి 75.29 వద్ద స్థిరపడింది. ఇటీవల దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు)పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. 

అంతర్జాతీయంగా డాలర్‌ విలువ బలహీనపడింది. ఈ అంశాలు మన కరెన్సీకి కలిసొచ్చాయి. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 75.54 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.27 స్థాయి వద్ద గరిష్టాన్ని అందుకుంది. క్రూడాయిల్‌ ధరల్లో ఒడిదుడుకులు, భౌగోళిక అనిశ్చితుల ఆందోళనలతో లాభాలు పరిమితమైనట్లు ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. 

‘‘రష్యాపై ఆంక్షల విధింపు ప్రభావం, షాంఘైలో లాక్‌డౌన్‌ విధింపుతో చైనా వృద్ధి అవుట్‌లుక్‌ అంచనాలతో పాటు ఆర్‌బీఐ ద్రవ్యపాలసీ నిర్ణయాలు రానున్న రోజుల్లో రూపాయి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ కమోడిటీ కరెన్సీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుగంధ సచ్‌దేవ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు