స్టార్టప్‌లు జాగ్రత్త! పునాదులు కదులుతున్నాయ్‌!

30 May, 2022 20:09 IST|Sakshi

నిన్నా మొన్నటి వరకు మంచి ఐడియా ఉంటే చాలు కొద్ది రోజుల్లోనే వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించవచ్చనే నమ్మకం కలిగించాయి స్టార్టప్‌లు. కానీ గత ఆర్నెళ్లుగా పరిస్థితి మారిపోయింది. స్టార్టప్‌లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. లాభాల మాట దేవుడెరుగు వరుసగా వస్తున్న నష్టాలకు తాళలేక ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయ్‌. 

అప్పట్లో జోరు
కోవిడ్‌ సంక్షోభం మొదలైన తర్వాత సంప్రదాయ వ్యాపారాలు అతలాకుతలం అయితే టెక్‌ కంపెనీలు తారా జువ్వల్లా దూసుకుపోయాయి. ముఖ్యంగా ఇంటర్నెట్‌ ఆధారిత సేవలు అందించే కంపెనీల జోరుకు పగ్గాలు వేయడం కష్టం అన్నట్టుగా దూసుకుపోయాయి. కానీ కరోనా కంట్రోల్‌కి వచ్చాక పరిస్థితి మారుతోంది. టెక్‌ అధారిత ఆన్‌లైన్‌ సేవలు అందించే కంపెనీల పునాదులు కంపిస్తున్నాయి. 

స్టార్టప్‌ల బిక్కముఖం
గత ఏడాది కాలంగా భారీగా పెట్టుడులను ఆకర్షిస్తూ వచ్చిన స్టార్టప్‌లు ఇప్పుడు బిక్కముఖం వేస్తున్నాయి. చేస్తున్న ఖర్చుకు వస్తున్న ఆదాయానికి పొంతన లేకపోవడంతో నష్టాల్లోకి కూరుకుపోతున్నాయి. దీంతో నిర్వాహాణ ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులకు ఎగ్జిట్‌ గేటును చూపిస్తున్నాయి. వరుసగా ప్రతీ వారం రెండు మూడు యూనికార్న్‌ హోదా సాధించిన స్టార్టప్‌లు కూడా నష్టాలను ఓర్చుకోలేకపోతున్నాయి.

అంచనాలు తలకిందులు
తాజాగా మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌) స్టార్టప్‌ వంద మంది ఉద్యోగులకు ఇంటి దారి చూపించింది. అదే విధంగా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇండోనేషియాలో కార్యకలాపాలకు స్వస్థి పలికింది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ప్రజలు అనివార్యంగా పొదుపు వైపు మళ్లుతున్నారు. దీంతో వ్యాపారాలు ఆశించిన స్థాయిలో జరగక స్టార్టప్‌ల అంచనాలు తలకిందులవుతున్నాయి. ఇప్పటికే కార్ 24, అన్‌అకాడమీ తదితర స్టార్టప్‌లు ఉద్యోగుల చేత బలవంతంగా రాజీనామా చేయించాయి. 

చదవండి: బిజినెస్‌ ‘బాహుబలి’ భవీశ్‌

మరిన్ని వార్తలు