సరికొత్త శిఖరానికి సెన్సెక్స్‌

4 Jun, 2021 02:00 IST|Sakshi

ఇంట్రాడే, ముగింపులో నిఫ్టీ ఆల్‌టైం హై నమోదు

ఆర్‌బీఐ పాలసీ వెల్లడికి ముందు కొత్త రికార్డులు

బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడికి ముందు స్టాక్‌ మార్కెట్లో గురువారం సూచీలు సరికొత్త రికార్డులను లిఖించాయి. గత రెండురోజుల పాటు పరిమిత శ్రేణిలో ట్రేడైన సెన్సెక్స్, నిఫ్టీలు.., బ్యాంకింగ్, ఆర్థిక, మౌలిక రంగాల షేర్లు రాణించడంతో భారీ లాభాల్ని మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 383 పాయింట్లు లాభపడి 52,232 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు  సూచీకి జీవితకాల గరిష్టస్థాయి. అంతకు ముందు సెన్సెక్స్‌కు (ఈ ఫిబ్రవరి 15న) జీవితకాల గరిష్ట ముగింపు స్థాయి 52,154 గా ఉంది. ఇక నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 15,690 వద్ద ముగిసింది.

ఇంట్రాడే 130 పాయింట్లు లాభపడి 15,705 స్థాయిని తాకింది. ముగింపు, ఇంట్రాడే స్థాయిలు నిఫ్టీకి జీవితకాల గరిష్టాలు కావడ విశేషం. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. తిరిగి మిడ్‌సెషన్‌ నుంచి లాభాల్లోకి మళ్లాయి. అయితే ఫార్మా, ఆటో, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్‌ఈ స్మాల్‌ మిడ్‌క్యాప్‌ సూచీలు ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి.

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మూడురోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ 18 పైసలు బలపడి 72.91 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1079 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.279 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. సూచీల రికార్డు ర్యాలీని తిరిగి అందుపుచ్చుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగింది. గురువారం ఒక్కరోజే రూ.1.88 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రికార్డు స్థాయి రూ.226 లక్షల కోట్లకు చేరింది. అమెరికా స్థూల ఆర్థిక గణాంకాల ప్రకటనకు ముందు అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

ఏడోరోజూ రిలయన్స్‌ షేరు ర్యాలీ...  
డైవర్సిఫైడ్‌ దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌      షేరు ర్యాలీ ఏడోరోజూ కొనసాగింది. భారీ ఎత్తున నిధులను సమీకరించుకోవడంతో పాటు       బ్యాలెన్స్‌ షీటును మరింత పటిష్టపరుచుకున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ ముకేశ్‌ అంబానీ ప్రకటనతో ఈ షేరుకు గురువారం డిమాండ్‌ పెరిగింది.        బీఎస్‌ఈలో ఒక శాతం లాభంతో రూ.2222 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో రెండుశాతానికి పైగా రాణించి రూ.2250 స్థాయిని తాకింది. చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో అరశాతం స్వల్పంగా పెరిగి రూ.2209 వద్ద ముగిసింది. ఈ ఏడు సెషన్లలో షేరు 14.53 శాతం ర్యాలీ చేసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,423,883 కోట్లకు చేరుకుంది.

>
మరిన్ని వార్తలు