మేడిన్‌ ఇండియా బొమ్మల హవా

20 Sep, 2022 01:02 IST|Sakshi

బొంగరాలు, విక్రమ్‌ బేతాళ్‌ పజిల్స్‌ మొదలైన వాటికి డిమాండ్‌

1.5 బిలియన్‌ డాలర్ల దేశీ టాయ్స్‌ మార్కెట్‌

రెండేళ్లలో 3 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు

చెన్నై: లెగో, బార్బీ లాంటి విదేశీ ఉత్పత్తులను పక్కన పెట్టి దేశీయంగా మన ఆటలు, బొమ్మలు, ఆట వస్తువులకు డిమాండ్‌ పెరుగుతోంది. బొంగరాలు, విక్రమ్‌ బేతాళ్‌ పజిళ్లు, ఇతరత్రా దేశీ థీమ్స్‌తో తయారవుతున్న ఆటవస్తువులపై పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. టాయ్స్‌ పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్దిష్ట నిబంధనలను తప్పనిసరి చేయడంతో కొన్ని రకాల బొమ్మలను దిగుమతి చేసుకోవడం కొంత తగ్గింది. అదే సమయంలో దేశీ టాయ్స్‌ తయారీ సంస్థలు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టాయి.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాయి. మార్కెట్‌ లీడర్లయిన ఫన్‌స్కూల్, హాస్‌బ్రో, షుమీ లాంటి సంస్థలు ఆట వస్తువులు, గేమ్స్‌ను రూపొందిస్తున్నాయి. జన్మాష్టమి మొదలుకుని రామాయణం వరకు వివిధ దేశీ థీమ్స్‌ కలెక్షన్లను కూడా తయారుచేస్తున్నాయి. పిల్లలు ఆడుకునే సమయం కూడా అర్థవంతంగా ఉండాలనే ఆలోచనా ధోరణి కొత్త తరం పేరెంట్స్‌లో పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి హాట్‌ కేకులుగా అమ్ముడవుతున్నాయి.

సంప్రదాయ భారతీయ గేమ్స్‌కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే లభిస్తోందని ఫన్‌స్కూల్‌ వర్గాలు తెలిపాయి. దీంతో తాము బొంగరాలు, గిల్లీడండా (బిళ్లంగోడు) లాంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నాయి. తాము చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు, ఆటల్లాంటివి తమ పిల్లలకు కూడా పరిచయం చేయాలన్న ఆసక్తి సాధారణంగానే తల్లిదండ్రుల్లో ఉంటుందని, ఇది కూడా దేశీ గేమ్స్‌ ఆదరణ పొందడానికి కారణమవుతోందని హాస్‌బ్రో ఇండియా వర్గాలు పేర్కొన్నాయి.

  ఈ బొమ్మలు, గేమ్స్‌ మొదలైనవి పూర్తిగా దేశీయంగానే తయారవుతున్నాయని, దీనితో స్థానికంగా కొనుగోళ్లు, తయారీకి కూడా ఊతం లభిస్తోందని వివరించాయి. తాము మోనోపలీ ఆటను తమిళంలో కూడా అందుబాటులోకి తెచ్చామని, దీన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని పేర్కొన్నాయి. అటు జన్మాష్టమి కలెక్షన్‌ ఆవిష్కరించిన ఆటవస్తువుల కంపెనీ షుమీ కొత్తగా దీపావళి కలెక్షన్‌ను కూడా ప్రవేశపెడుతోంది.

90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే..
దేశీ టాయ్స్‌ మార్కెట్‌ 1.5 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో సింహభాగం 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే ఉంటోంది. అంతర్జాతీయంగా టాయ్స్‌ మార్కెట్‌ 5 శాతం మేర వృద్ధి చెందుతుంటే మన మార్కెట్‌ మాత్రం 10–15 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లలో మార్కెట్‌ పరిమాణం 2–3 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎంతో కాలంగా భారత్‌లో దేశీ ఆటవస్తువులు, బొమ్మలు, గేమ్స్‌కు డిమాండ్‌ ఉన్నప్పటికీ తయారీ సంస్థలు ఇప్పుడు దాన్ని గుర్తిస్తున్నాయని టాయ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రటరీ శరద్‌ కపూర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు