గోదాముల లీజు విస్తీర్ణంలో 62 శాతం వృద్ధి

23 Sep, 2022 11:43 IST|Sakshi

2021–22లో 51.3 మిలియన్‌ చదరపు అడుగులు

టాప్‌–2లో హైదరాబాద్‌ నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన పట్టణాల్లో గోదాములకు డిమాండ్‌ ఏర్పడింది. లీజు విస్తీర్ణం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 62 శాతం వృద్ధితో 51.3 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంది. థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్, ఈ కామర్స్‌ సంస్థల నుంచి డిమాండ్‌ పెరిగినట్టు తెలిపింది. నూతన లాజిస్టిక్స్‌ పాలసీ ఈ రంగానికి సాయంగా నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు భారత్‌ వేర్‌హౌసింగ్‌ మార్కెట్‌పై నైట్‌ ఫ్రాంక్‌ ఓ నివేదికను విడుదల చేసింది. లీజు విస్తీర్ణం వృద్ధి పరంగా పుణె, హైదరాబాద్‌ టాప్‌–2 మార్కెట్లుగా ఉన్నాయి. పుణెలో 166 శాతం, హైదరాబాద్‌ మార్కెట్లో 128 శాతం చొప్పున గోదాముల లీజు గత ఆర్థిక సంవత్సరంలో పెరిగింది.

భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, వినియోగం పెరగడం సంఘటిత రంగంలో గోదాముల లీజు అధిక వృద్ధికి దోహదం చేస్తున్నట్టు తెలిపింది. కరోనా ముందు నాటి పరిమాణాన్ని గోదాముల లీజు అధిగమించినట్టు పేర్కొంది. ఇనిస్టిట్యూషన్స్‌ సైతం గోదాముల నిర్వహణ, అభివృద్ధి పట్ల ఆసక్తి చూపిస్తుండడం వల్ల.. నిపుణుల అనుభవం వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌ను నడిపిస్తుందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు. వేర్‌హౌసింగ్‌ వృద్ధి టాప్‌–8 పట్టణాలకు వెలుపల కూడా జోరందుకుంటోందని.. మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ల ఏర్పాటు, మరిన్ని వేర్‌ హౌస్‌ జోన్‌ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది.  

పట్టణాల వారీగా..  
►   ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వేర్‌హౌస్‌ లీజు విస్తీర్ణం 2021–22లో 32 శాతం పెరిగి 9.1 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. 
►   ముంబైలో 48 శాతం పెరిగి 8.6 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది.  
►    బెంగళూరులో 38 శాతం వృద్ధితో 5.9 మిలియన్‌ చదరపు అడుగుల పరిమాణంలో గోదాములు లీజు నమోదైంది.  
►   పుణెలో 166 శాతం పెరిగి 7.5 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్‌లో 128 శాతం పెరిగి 5.4 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంది.  
►   అహ్మదాబాద్‌లో 81 శాతం వృద్ధితో 5.3 మిలియన్‌ చదరపు అడుగులు, చెన్నైలో 44 శాతం పెరిగి 5.1 మిలియన్‌ చదరపు అడుగులు, కోల్‌కతాలో 41 శాతం పెరిగి 4.3 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది.

>
మరిన్ని వార్తలు