వైర్‌ నుంచి వైర్‌లెస్‌కు...

6 Mar, 2021 06:35 IST|Sakshi

జోరుగా వేరబుల్స్‌ అమ్మకాలు

2020లో మూడంకెల వృద్ధి

కొనసాగుతున్న టాప్‌–3 స్థానం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చేతికి స్మార్ట్‌వాచ్, చెవిలో వైర్‌లెస్‌ డివైస్‌.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్‌. స్మార్ట్‌ఫోన్స్‌తోపాటు వేరబుల్స్‌కు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. భారత్‌ విషయానికి వస్తే వేరబుల్స్‌ మార్కెట్‌ 2019తో పోలిస్తే 2020లో 144.3 శాతం వృద్ధి సాధించిందని పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌–20 మార్కెట్లలో మూడంకెల వృద్ధి నమోదు చేసి భారత్‌ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది దేశవ్యాప్తంగా 3.64 కోట్ల యూనిట్ల వేరబుల్స్‌ అమ్ముడయ్యాయి. అంతర్జాతీయంగా అమ్మకాల పరంగా మూడవ స్థానాన్ని కొనసాగిస్తూ కంపెనీలను భారత్‌ ఊరిస్తోంది.  

అమ్మకాలు ఎందుకంటే...
ఇయర్‌వేర్‌ డివైస్‌ వినియోగం పెరగడం, రిస్ట్‌ బ్యాండ్స్‌ నుంచి స్మార్ట్‌వాచ్‌ల వైపు కస్టమర్లు మళ్లడం ఈ స్థాయి విక్రయాలకు కారణం. ఈ రెండు విభాగాలు దేశంలో తొలిసారిగా 2020లో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించాయి. అక్టోబరు–డిసెంబరు త్రైమాసికంలో ఇప్పటి వరకు అత్యధికంగా 1.52 కోట్ల యూనిట్ల వేరబుల్స్‌ సేల్స్‌ జరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 198.2 శాతం అధికం. ఇక 2020లో స్పష్టమైన మార్పు ఏమంటే ఆడియో విభాగంలో వైర్డ్‌ నుంచి వైర్‌లెస్‌ వైపు మార్కెట్‌ దూసుకెళ్లడమే. 2021లో ఈ విభాగంలో మెరుగైన అనుభూతినిచ్చే అధునాతన పరికరాలు కస్టమర్ల ముందుకు రానున్నాయి. వేరబుల్స్‌ రంగంలో ఇయర్‌వేర్‌ వాటా అత్యధికంగా 83.6 శాతం ఉంది.
 
రిస్ట్‌ బ్యాండ్స్‌ నుంచి..
గతేడాది దేశంలో 26 లక్షల యూనిట్ల స్మార్ట్‌వాచ్‌లు అమ్ముడయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 139.3 శాతం అధికం. సగం విక్రయాలు అక్టోబరు–డిసెంబరు పీరియడ్‌లో నమోదు కావడం విశేషం. ఒక త్రైమాసికంలో 10 లక్షల యూనిట్లు దాటడం ఇదే తొలిసారి. తక్కువ ధరలోనూ స్మార్ట్‌వాచ్‌లు లభ్యం కావడంతో రిస్ట్‌ బ్యాండ్స్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. 2019లో రిస్ట్‌ బ్యాండ్స్‌ 33 లక్షల యూనిట్లు అమ్ముడైతే, గతేడాది 34.3 శాతం తగ్గాయి. తొలినాళ్లలో స్మార్ట్‌వాచ్‌ల ధర రూ.20,000 ఉండేది. ఇప్పుడు రూ.5 వేల లోపు ధరలోనే లభిస్తున్నాయని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ తెలిపారు. కొత్త ఫీచర్లు తోడవడం కూడా వీటికి ఆదరణ పెంచుతోందని చెప్పారు.

తగ్గుతున్న ధరలు..
ఇయర్‌వేర్‌ అమ్మకాలు మూడింతలు పెరిగి గతేడాది 3.04 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. డిసెంబరు త్రైమాసికంలో 300 శాతం వృద్ధి చెంది 1.29 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. అందుబాటు ధరలో లభించడం, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు వర్చువల్‌ మీటింగ్స్, ఆన్‌లైన్‌ తరగతులు వెరశి ఈ విభాగం దూసుకెళ్తోందని బి–న్యూ మొబైల్స్‌ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. ట్రూలీ వైర్‌లెస్‌ స్టీరియో డివైసెస్‌ ఏకంగా పదింతలై 1.13 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. పోటీ తీవ్రం కావడంతో చాలా కంపెనీలు అందుబాటు ధరలో ప్రవేశపెడుతున్నాయి. వీటి సగటు ధర 2019లో రూ.8,000 ఉంటే, గతేడాది ఇది రూ.3,200లకు వచ్చి చేరింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు