40 రోజుల్లో 32 లక్షల వివాహాలు.. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా!

8 Nov, 2022 20:06 IST|Sakshi

పెళ్లి.. ఇది రెండక్షరాలే, కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కటై జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దీని విశిష్టత ఇప్పటికీ అలానే ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో మాత్రం గతంతో పోలిస్తే చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. గ‌తంలో వివాహాలు వరుడు లేదా వధువు ఇళ్లలో జరిగేవి, లేదంటే వారి ప్రాంతానికే ప‌రిమితంగా ఉండేవి. అయితే మారుతున్న ట్రెండ్‌, డ‌బ్బు సంపాద‌న పెర‌గ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ వివాహాల కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు.

ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌ మాసాల్లో జరిగే లక్షలాది జంటల వివాహ వేడుకల సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనున్నాయి. నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు, వాటి ద్వారా సుమారు రూ.3.75లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) అంచనా వేసింది.

సీఏఐటి.. దేశవ్యాప్తంగా 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో 35 నగరాల పరిధిలో కెయిట్ అనుబంధ రీసెర్చ్ సంస్థ ఈ అధ్య‌య‌నం జ‌రిపింది. ఈ సీజన్‌లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ఢిల్లీలోనే దాదాపు ₹75,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని (సీఏఐటి)CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు.

గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపు 25 లక్షల వివాహాలు, ₹3 లక్షల కోట్లు ఖర్చు అయినట్టు అంచనా. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో, మార్కెట్‌లలో పెళ్లి కొనుగోళ్ల ద్వారా దాదాపు ₹3.75 లక్షల కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ తదుపరి దశ జనవరి 14 నుంచి ప్రారంభమై జూలై వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
 


చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ!

మరిన్ని వార్తలు