భారతీయుల ‘స్విస్‌’ సంపద మూడింతలు

18 Jun, 2021 00:44 IST|Sakshi

2020లో రూ.20,700 కోట్లకు

13 సంవత్సరాల గరిష్ట స్థాయి

2019లో ఈ మొత్తం రూ.6,625 కోట్లు

న్యూఢిల్లీ/జూరిచ్‌: భారతీయలు, భారత కంపెనీల సంపద స్విస్‌ బ్యాంకుల్లో 2020 చివరికి వార్షికంగా మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌కు (దాదాపు రూ.20,700 కోట్లు) చేరింది. 2019 ముగిసే నాటికి ఈ విలువ 899 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్స్‌ (దాదాపు రూ.6,625 కోట్లు). రెండు సంవత్సరాల దిగువముఖం తరువాత 2020లో తిరిగి ఇండియన్‌ క్లైంట్స్‌ నిధులు ఏకంగా 13 సంవత్సరాల గరిష్టానికి చేరాయి.

బాండ్లు, తత్సంబంధ ఇన్‌స్ట్రుమెంట్లలో (పథకాలు) ఉంచిన సంపద భారీగా పెరగడం దీనికి కారణం. కాగా, కస్టమర్‌ డిపాజిట్లు మాత్రం 2020లో పడిపోయాయి. భారత్‌ కేంద్రంగా పనిచేస్తున్న బ్రాంచీలు, ఇతర ఫైనాన్షియల్‌ సంస్థల ద్వారా భారతీయులు, భారత్‌ కంపెనీలు స్విస్‌ బ్యాంకుల్లో ఉంచిన నిధుల గణాంకాలను స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గురువారం విడుదల చేసింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..   

► 2006లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్‌ డాలర్లు. 2011, 2013, 2017సహా కొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన కాలాల్లో ఈ పరిమాణాలు డౌన్‌ ట్రెండ్‌లోనే నడిచాయి.  
► 2020లో కస్టమర్‌ అకౌంట్‌ డిపాజిట్లు 503.9 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌ (రూ.4,000 కోట్లు). 2019లో ఈ మొత్తం 550 మిలియన్‌ ఫ్రాంక్స్‌.  
► గణాంకాల ప్రకారం, 2020 చివరినాటికి స్విట్జర్లాండ్‌లో 243 బ్యాంకులు పనిచేస్తున్నాయి.  

నల్లధనంపై లేని సమాచారం
స్విట్జర్లాండ్‌లో భారతీయులు ఉంచినట్లు పేర్కొంటున్న తీవ్ర చర్చనీయాంశం ‘నల్లధనం’ గురించి గణాంకాల్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. పైగా భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉంచిన నిధులను ‘నల్లధనం’గా పరిగణించబోమని ఆ దేశం తరచూ పేర్కొంటోంది. పన్ను ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి కేసుల విషయంలో విచారణకు భారత్‌కు మద్దుతు, సహకారం ఇస్తామని కూడా స్పష్టం చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య 2018 నుంచీ ఒక అవగాహనా ఒప్పందం కూడా అమల్లో ఉంది. ఈ మేరకు తమ దేశంలో భారతీయుల అకౌంట్ల సమాచారాన్ని 2019 సెప్టెంబర్‌లో మొట్టమొదటిసారి అందజేసింది. ప్రతి సంవత్సరం ఈ విధానాన్ని కొనసాగిస్తోంది.  

తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా
అన్ని స్విస్‌ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో దాదాపు 2 ట్రిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌లకు చేరాయి. ఇందులో 600 బిలియన్‌ డాలర్లు ఫారన్‌ కస్టమర్‌ డిపాజిట్లు. 377 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌తో బ్రిటన్‌ ముందు నిలిచింది. ఇందుకు సంబంధించి 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. 100 బిలియన్‌ ఫ్రాంక్స్‌ పైన నిలిచిన దేశాలు ఈ రెండే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు