మూడు రెట్లు పెరగనున్న గ్యాస్‌ వినియోగం

26 Nov, 2021 01:31 IST|Sakshi

2030 నాటికి 500 ఎంఎంఎస్‌సీఎండీ

ప్రస్తుత వినియోగం 174 ఎంఎంఎస్‌సీఎండీ

న్యూఢిల్లీ: దేశంలో గ్యాస్‌ వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం రోజువారీగా 174 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యుబిక్‌ మీటర్‌ (ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను వినియోగిస్తుండగా.. 2030 నాటికి 550 ఎంఎంఎస్‌సీఎండీకి చేరుకుంటుందని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (గెయిల్‌) మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ రంగనాథన్‌ తెలిపారు. ఈటీఎనర్జీ వరల్డ్‌ గ్యాస్‌ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2070 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను నికరంగా సున్నా స్థాయికి  తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శుద్ధమైన, తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారనున్నట్టు రంగనాథన్‌ చెప్పారు. ‘‘ప్రధాన ఇంధనాల మిశ్రమం నుంచి బొగ్గు వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పుడు స్పష్టమైన విధాన మార్గదర్శకత్వం ఉంది. నికర సున్నా స్థాయికి ఉద్గారాలను తగ్గించడంలో గ్యాస్‌తోపాటు బ్లూ హైడ్రోజన్, అమ్మోనియా గొప్ప పాత్రను పోషించబోతున్నాయి’’ అని చెప్పారు. ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను ప్రస్తుతమున్న 6.2 శాతం నుంచి 2030 నాటికి 15 శాతానికి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.  

దేశీయంగా పెరగనున్న ఉత్పత్తి
‘‘ప్రస్తుత 174 ఎంఎంఎస్‌సీఎండీ  డిమాండ్‌లో ఎక్కువ భాగం ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌లు, పట్టణ గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌లు, విద్యుత్‌ యూనిట్ల నుంచే వస్తోంది. ఇందులో 49 ఎంఎంఎస్‌సీఎండీ దేశీయంగా ఉత్పత్తి అవుతుంటే, మిగిలినది ఎల్‌ఎన్‌జీ దిగుమతుల రూపంలో సమకూర్చుకుంటున్నాం. 2029–30 నాటికి దేశీయంగానే సరఫరా 380ఎంఎంఎస్‌సీఎండీకి చేరుకుంటుంది’’ అని రంగనాథన్‌ వివరించారు.

మరిన్ని వార్తలు