ఏప్రిల్‌లో సేవల రంగం భేష్‌

6 May, 2022 04:44 IST|Sakshi

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా

పీఎంఐ 57.9కి అప్‌; 5 నెలల గరిష్టం  

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం ఏప్రిల్‌లో మంచి పనితీరు ప్రదర్శించింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 57.9కి ఎగసింది. గత 5 నెలల్లో ఈ స్థాయి నమో దు ఇదే తొలిసారి. మార్చిలో సూచీ 53.6 వద్ద ఉంది. కొత్త వర్క్‌ ఆర్డర్ల పెరుగుదల, సానుకూ ల వ్యాపార క్రియాశీలత వంటి అంశాలు ఇండెక్స్‌కు బలాన్ని అందించాయి. సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ‘సేవల పీఎంఐ డేటా ప్రోత్సాహకరంగా ఉంది. పెరుగుతున్న డిమాండ్‌  దీనికి కారణం’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పొలియానా డి లిమా పేర్కొన్నారు.  

సేవలు, తయారీ... దూకుడే:  కాగా సేవలు, తయారీ రంగం కలగలిపిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ మార్చిలో 54.3 వద్ద ఉంటే, ఏప్రిల్లో 57.6కు ఎగసింది. ఈ సూచీ కూడా ఐదు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల్లో కొంత మెరుగుదల కనబడింది. ఒక్క తయారీకి సంబంధించి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఏప్రిల్‌లో 54.7గా నమోదయ్యింది. సూచీ మార్చిలో 54 వద్ద ఉంది.

మరిన్ని వార్తలు