మార్కెట్‌కు ఫెడ్‌ జోష్‌..!

18 Dec, 2020 02:52 IST|Sakshi

కొనసాగిన రికార్డులు

ఐదోరోజూ లాభాలే

13,700 పైన నిఫ్టీ ముగింపు

సెన్సెక్స్‌ లాభం 224 పాయింట్లు

రాణించిన ఆర్థిక, ఫార్మా, రియల్టీ రంగ షేర్లు

ముంబై: కీలక వడ్డీరేట్లపై సరళతర ధోరణికే కట్టుబడి ఉన్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు రాణించడం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు వరుసగా ఐదురోజూ లాభాల్లో ముగిశాయి. అలాగే కొత్త రికార్డుల నమోదును కొనసాగించాయి. సెన్సెక్స్‌ 224 పాయింట్లు లాభంతో 46,890 వద్ద సిర్థపడింది. నిఫ్టీ సైతం 58 పాయింట్లు బలపడి 13,741 వద్ద నిలిచింది. కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలు కనిపించడం, పలు దేశాల్లో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌కు అనుమతినివ్వడం,  దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి సానుకూలాంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి.

ఆర్థిక, ప్రైవేట్‌ రంగ బ్యాంక్, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెనెక్స్‌ ఇంట్రాడేలో 326 పాయింట్లు లాభపడి 46,992 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 90 పాయింట్లు ర్యాలీ చేసి 13,773 వద్ద నూతన ఆల్‌టైం హైని నమోదు చేసింది. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, మీడియా షేర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సూచీలు కొత్త రికార్డు సృష్టిస్తున్నప్పటికీ.., ఇటీవల మధ్య, చిన్న తరహా షేర్లు స్తబ్ధుగా ట్రేడ్‌ అవుతున్నాయని నిపుణులు తెలిపారు. గురువారం రికార్డు ర్యాలీలో ఈ షేర్ల వాటా అత్యంత స్వల్పంగా ఉంది. ఈ తరుణంలో అప్రమత్తతతో కూడిన ట్రేడింగ్‌ అవసరమని వారు సూచించారు.  

ప్రపంచ ఈక్విటీలకు ఫెడ్‌ రిజర్వ్‌ బూస్టింగ్‌...  
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు బుధవారం రాత్రి వెలువడ్డాయి. కరోనాతో పూర్తిగా కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలిచే చర్యల్లో భాగంగా కీలక వడ్డీరేట్లను మార్చలేదు. నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ, ఉద్యోగ కల్పన లక్ష్యాలను చేరుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు సరళతరమైన విధానాలకే కట్టుబడి ఉంటామని ఫెడ్‌ తెలిపింది. వ్యవస్థలో ద్రవ్యతను పెంచేందుకు 12 బిలియన్‌ డాలర్ల విలువైన నెల బాండ్ల కొంటామని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. ఫెడ్‌ సులభతరమైన ద్రవ్య పరపతి విధాన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు మరింత దూసుకెళ్లాయి. ఆసియాలో ప్రధాన దేశాల ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇందులో జపాన్‌కు చెందిన నికాయ్‌ సూచీ 29 ఏళ్ల గరిష్ట స్థాయి చేరువలో ముగిసింది. యూరప్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ ర్యాలీ చేశాయి. అమెరికా సూచీల్లో నాస్‌డాక్‌ ఇండెక్స్‌ బుధవారం సరికొత్త గరిష్టం వద్ద నిలిచింది. ఉద్దీపన ప్యాకేజీ ఆమోదం లభించవచ్చనే ఆశలతో అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.  

బెక్టర్స్‌ ఫుడ్‌ ఐపీఓ హాంఫట్‌
198 రెట్ల బిడ్లు  
బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాలిటీస్‌ కంపెనీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూ సైజుతో పోలిస్తే 198 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 176.85 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ లభించగా.. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి 620.86 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 29.28 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు ధర రూ.220గా పలుకుతోంది. ఐపీఓ ద్వారా రూ.540 కోట్లు సమీకరించాలనేది  కంపెనీ లక్ష్యం.

మరిన్ని వార్తలు