-

Indigo: ఇంటర్వ్యూలకు ఉద్యోగులు, ఫ్లైట్లు నడపలేక చేతులెత్తేసిన ఇండిగో!

4 Jul, 2022 16:30 IST|Sakshi

దేశ వ్యాప్తంగా విమానాల రాక పోకల్లో అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి ఎదురు చూస్తున్నా టికెట్లు బుక్‌ చేసుకున్న సమయానికి విమానాలు రాకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆయా విమానయాన సంస్థల్ని వివరణ కోరింది. అయితే పైలెట్లు, కేబిన్‌ సిబ్బంది పెద్ద సంఖ్యలో సిక్‌ లీవ్‌లు పెట్టి..ఇంటర్వ్యూలకు అటెండ్‌ అవుతున్నట్లు తేలింది.  

దేశంలోని ప్రధాన నగరాల్లో టాటాకు చెందిన ఎయిరిండియా, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇతర ఏవియేషన్‌ సంస్థలకు చెందిన పైలెట్లు, కేబిన్‌ సిబ్బంది సిక్‌ లీవ్‌లు పెడుతున్నారు. ఇంటర్వ్యూలకు అటెండ్‌ అవుతున్నారు. దీంతో విమాన రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి.

ఎయిర్ ఇండియా..ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌ కతా వంటి నగరాల్లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది. దీంతో షెడ్యూల్‌ టైంకు విమానాల రాకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఆయా ఏవియేషన్‌ సంస్థలపై కామెంట్ల రూపంలో మండిపడ్డారు.

ఇడిగో ఆలస్యం   
ఇండిగో విమానాల రాకపోకల్లో ఆలస్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. షెడ్యూల్‌ టైంకు కేవలం 45శాతమే విమానాల్ని నడిపించాయి. 850 కంటే ఎక్కువ విమానాలు వారి షెడ్యూల్ సమయం తర్వాత 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాయి. విమానయాన సంస్థ శుక్రవారం దాదాపు 1600 విమానాలను నడపగా..దాదాపు 50 విమానాల్ని రద్దు చేసింది. 

మా ఉద్యోగుల్ని సెలక్ట్‌ చేసుకోవద్దు.. కానీ 
ఇండిగో యాజమాన్యం తమ సమస్యను ఎయిర్ ఇండియా దృష్టికి తీసుకెళ్లింది. తమ నుండి 'నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్' లేదా రిలీవింగ్ లెటర్ లేకుండా సిబ్బందిని రిక్రూట్ చేయవద్దని ఎయిర్‌లైన్‌ని కోరినట్లు సమాచారం. కాగా, ఇదే అంశంపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందించలేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ డైరెక్టర్‌ అరుణ్ కుమార్‌ను సంప్రదిస్తే ఉద్యోగుల కొరతపై 'మేం పరిశీలిస్తున్నాం' అని చెప్పారు.

మరిన్ని వార్తలు