‘జీ’పై ఎన్‌సీఎల్‌టీకి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

7 Feb, 2022 06:19 IST|Sakshi

న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్‌ కేసులో మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీల్‌)పై కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ను ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఆశ్రయించింది. జీఎల్‌ రూ. 83.08 కోట్లు డిఫాల్ట్‌ అయినట్లు పేర్కొంది. దీనిపై ముంబైలోని ఎన్‌సీఎల్‌టీకి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ దరఖాస్తు సమర్పించినట్లు జీల్‌ వెల్లడించింది.

ఎస్సెల్‌ గ్రూప్‌ సంస్థ సిటీ నెట్‌వర్క్స్‌ పొందిన రుణానికి సంబంధించి బ్యాంకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంకు చర్యలు ప్రారంభించిందని జీల్‌ పేర్కొంది. దీనిపై న్యాయపరంగా తగు చర్యలు తీసుకుంటామని వివరించింది. దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్‌ 7 ప్రకారం రూ. 1 కోటికి పైగా రుణాలను ఎగవేసిన సంస్థలపై సీఐఆర్‌పీ కింద చర్యలు తీసుకోవాలంటూ రుణదాతలు .. కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. గతేడాది డిసెంబర్‌ 22న సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌తో జీల్‌ విలీనమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు