ఇండస్‌ఇండ్‌ లాభం జూమ్‌

19 Jan, 2023 12:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 1,964 కోట్లను తాకింది. రుణాల నాణ్యత మెరుగుపడటం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 4,495 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.17 శాతం మెరుగై 4.27 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం సైతం రూ. 1,877 కోట్ల నుంచి రూ. 2,076 కోట్లకు ఎగసింది.

మొత్తం ప్రొవిజన్లు రూ. 1,654 కోట్ల నుంచి రూ. 1,065 కోట్లకు క్షీణించాయి. క్యూ2 (జూలె–సెప్టెంబర్‌)తో పోలిస్తే తాజా స్లిప్పేజీలు రూ. 1,572 కోట్ల నుంచి రూ. 1,467 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.11 శాతం నుంచి 2.06 శాతానికి వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 18.01 శాతానికి చేరింది. ఈ కాలంలో 1,800 మందికి ఉపాధి కల్పించినట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో సుమంత్‌ కథ్‌పాలియా తెలియజేశారు. తొలి 9 నెలల్లో 8,500 మందిని జత చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో బ్యాంక్‌ మొత్తం సిబ్బంది సంఖ్య  37,870కు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్‌ఇండ్‌ షేరు బీఎస్‌ఈలో 0.7% క్షీణించి రూ. 1,222 వద్ద ముగిసింది.

చదవండి: కొత్త ఏడాది టెక్కీలకు గుడ్‌ న్యూస్‌.. జీతాలు పెరగనున్నాయ్‌!

మరిన్ని వార్తలు