టాటా కాఫీ- ఇండస్‌ఇండ్‌.. అదరహో!

29 Jul, 2020 10:13 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

టాటా కాఫీ 11 శాతం హైజంప్

‌ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4 శాతం అప్‌

విదేశీ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)  తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కౌంటర్‌ వెలుగులో నిలుస్తోంది. మరోవైపు ఇదే కాలంలో పటిష్ట పనితీరు చూపడంతో పానీయాల దిగ్గజం టాటా కాఫీ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నికర లాభం 68 శాతం క్షీణించింది రూ. 461 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 8681 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 72 శాతం పడిపోయి రూ. 602 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు 2.45 శాతం నుంచి 2.53 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇండస్‌ఇండ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.2 శాతం జంప్‌చేసి రూ. 549 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 565 వరకూ ఎగసింది.

టాటా కాఫీ
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన టాటా కాఫీ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 36 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 26 శాతం పుంజుకుని రూ. 588 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 65 శాతం వృద్ధితో రూ. 79 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో టాటా కాఫీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 11.5 శాతం దూసుకెళ్లి రూ. 93 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 97 వరకూ ఎగసింది.

మరిన్ని వార్తలు