పరిశ్రమలు.. పరుగు..పారిశ్రామిక ఉత్పత్తిలో కొత్త జోష్‌!

13 Jul, 2022 06:59 IST|Sakshi

మే నెలలో పారిశ్రామికోత్పత్తి 19.6% అప్‌ 

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి విషయంలో మే నెలకు సంబంధించి సూచీ ఎకానమీకి ఊరటనిచ్చింది. 2022లో 19.6 శాతం పురోగతిని (2021 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. తయారీ, విద్యుత్, మైనింగ్‌ రంగాలు మే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి పురోగతికి ఊతం ఇచ్చినట్లు మంగళవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం వివిధ రంగాల పనితీరును పరిశీలిస్తే... 

మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగం భారీగా 20.6 శాతం పురోగతి సాధించింది. 

విద్యుత్‌ రంగం ఉత్పత్తి 23.5 శాతం పెరిగింది. 

మైనింగ్‌ రంగంలో పురోగతి 10.9 శాతం,  

పెట్టుబడులకు, భారీ యంత్రసామగ్రి డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో వృద్ధి రేటు ఏకంగా 54%గా నమోదైంది. 

రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మెషీన్ల వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో 58.5 శాతం వృద్ధి నమోదయ్యింది. 

మరోవైపు 2022 ఏప్రిల్‌ ఐఐపీ తొలి అంచనాను 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. తొలి రెండు నెలల్లో ఇలా..: 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలలు.. ఏప్రిల్, మేలో ఐఐపీ వృద్ధి రేటు 12.9%గా నమోదైంది.

రూపాయి : 79.59 
ముంబై: సెంట్రల్‌ బ్యాంక్‌ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా విధాన నిర్ణయాలు డాలర్‌ మారకంలో రూపాయి పతనాన్ని నిలువరించలేకపోతున్నాయి. మంగళవారం రూపాయి డాలర్‌ మారకంలో మరో  కొత్త చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 14పైసలు పతనమై, 79.59కి రూపాయి బలహీనపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 79.66కు కూడా పడిపోయింది.

మరిన్ని వార్తలు