ఆరు నెలల తర్వాత వృద్ధిబాటకు పారిశ్రామిక ఉత్పత్తి

13 Nov, 2020 05:52 IST|Sakshi

సెప్టెంబర్‌లో 0.2 శాతం స్వల్ప పురోగతి

మైనింగ్, విద్యుత్‌ రంగాలు దోహదం

డ్యూరబుల్, నాన్‌–డ్యూరబుల్‌ కన్జూమర్‌ విభాగాలూ సానుకూలం  

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆరు నెలల క్షీణత తర్వాత తిరిగి వృద్ధిబాటకు మళ్లింది. 2020 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 0.2 శాతం స్వల్ప స్థాయి వృద్ధిని చూసింది (2019 సెపెంబర్‌ గణాంకాలతో పోల్చి). మైనింగ్, విద్యుత్‌ రంగాల్లో అధికోత్పత్తి దీనికి కారణమని గురువారం కేంద్రం వెలువరించిన గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన ఈ విభాగం ఇంకా క్షీణతలోనే ఉంది. సెప్టెంబర్‌లో 0.6 శాతం క్షీణత నమోదయ్యింది.  

మైనింగ్‌:  ఈ విభాగంలో వృద్ధి 1.4 శాతంగా ఉంది.  

విద్యుత్‌:  4.9 శాతం వృద్ధిరేటు వచ్చింది.  
క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్రపరికాల ఉత్పత్తి, డిమాండ్‌కు సంకేతమైన క్యాపిటల్‌ గూడ్స్‌లో ఉత్పత్తి సెప్టెంబర్‌లో 3.3 శాతం క్షీణతలో ఉంది.  
కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీ షనర్లు వంటి దీర్ఘకాల కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో 2.8% వృద్ధి నమోదవడం కీలకాంశం.  ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక సానుకూల అంశం.
కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌: సబ్బులు, టూత్‌పేస్టులు వంటి ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) విషయంలో ఉత్పత్తి భారీగా 4.1 శాతంగా నమోదయ్యింది.

ఆరు నెలల్లో క్షీణతే...
కాగా, ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఐఐపీ భారీగా 21.1 శాతం క్షీణతలోనే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 1.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది.  

తక్కువ బేస్‌రేటే కారణమా?
పారిశ్రామిక ఉత్పత్తిలో తాజాగా వృద్ధి రేటు కనబడ్డానికి తక్కువ బేస్‌రేటే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 2019 సెప్టెంబర్‌లో ఐఐపీ భారీ క్షీణతలో మైనస్‌ 4.6 శాతంగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదయ్యింది. అటు తర్వాత మార్చి (–18.7 శాతం), ఏప్రిల్‌ (–57.3 శాతం), మే (–33.4 శాతం), జూన్‌ (–16.6 శాతం), జూలై (–10.8 శాతం) ఆగస్టులో (–8 శాతం) క్షీణ రేటు నమోదయ్యింది. అయితే కఠిన లాక్‌డౌన్‌ నెల ఏప్రిల్‌లో భారీ క్షీణత తర్వాత మైనస్‌రేట్లు క్రమంగా తగ్గుతుండడం పరిగణనలోకి తీసుకోవాల్సిన సానుకూల అంశం. 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) లాక్‌డౌన్‌ జరిగింది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల వల్ల వివిధ రంగాల్లో క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు పునరుత్తేజం అవుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా