జనవరిలో 47 లక్షల కొత్త ఫోలియోలు

21 Feb, 2024 08:19 IST|Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో జనవరిలో 46.7 లక్షల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. డిజిటల్‌ మార్గాల ద్వారా ఫండ్స్‌లో సులభంగా ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటుకుతోడు, ఆర్థిక సాధనాల పట్ల పెరుగుతున్న అవగాహన ఈ వృద్ధికి తోడ్పుడుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలించినా, నెలవారీగా ఫోలియోల పెరుగుదల 22.3 లక్షలుగా ఉన్నట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) తాజా డేటా వెల్లడిస్తోంది.

 ఈ ఏడాది జనవరి చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఫోలియోలు 16.96 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది జనవరి చివరికి ఉన్న 14.28 కోట్ల ఫోలియోలతో పోలిస్తే 19 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక 2023 డిసెంబర్‌ చివరి నుంచి ఈ ఏడాది జనవరి చివరికి ఫోలియోలలో 3 శాతం వృద్ధి నమోదైంది. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి సంబంధించి ఇచ్చే గుర్తింపును ఫోలియో (పెట్టుబడి ఖాతా)గా చెబుతారు. ఒక ఇన్వెస్టర్‌కు ఒకటికి మించిన పథకాల్లో పెట్టుబడులు కలిగి ఉంటే, అప్పుడు ఒకటికి మించిన ఫోలియోలు ఉంటాయి.  

పెరుగుతున్న అవగాహన 
‘‘డిజిటల్‌ పరిజ్ఞానం పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆరి్థక అక్షరాస్యత అనేవి సంప్రదాయ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫోస్టాఫీస్‌ సేవింగ్‌ స్కీమ్‌లు కాకుండా ఇతర సాధనాల వైపు చూసేలా చేస్తున్నాయి. ఇదే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఇతోధికం కావడానికి దోహం చేస్తున్నాయి’’అని వైట్‌ఓక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ప్రతీక్‌ పంత్‌ తెలిపారు. మెజారిటీ ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు డిజిటల్‌ ఛానళ్లనే ఎంపిక చేసుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరిలో నమోదైన 46.7 లక్షల ఫోలియోలలో ఈక్విటీలకు సంబంధించి 34.7 లక్షలుగా ఉన్నాయి. దీంతో జనవరి చివరికి ఈక్విటీ పథకాలకు సంబంధించిన ఫోలియోలు 11.68 కోట్లకు చేరాయి. జనవరిలో హైబ్రిడ్‌ ఫండ్స్‌కు సంబంధించి 3.36 లక్షల ఫోలియోలు కొత్తగా నమోదయ్యాయి.

దీంతో హైబ్రిడ్‌ పథకాలకు సంబంధించి మొత్తం ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. డెట్‌ పథకాలకు సంబంధించిన ఫోలియోలు వరుసగా ఐదో నెలలోనూ క్షీణతను చూశాయి. జనవరిలో డెట్‌ పథకాలకు సంబంధించి 74.66 లక్షల ఫోలియోలు తగ్గాయి. గడిచిన కొన్ని సంవత్సరాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఫోలియోలు, పెట్టుబడులు గణనీయంగా పెరిగినప్పటికీ.. దేశ జనాభాలో ఈ సాధనాల వ్యాప్తి ఇప్పటికీ 3 శాతం మించలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 45 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తులు జనవరి చివరికి రూ.53 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం.   
 

whatsapp channel

మరిన్ని వార్తలు