దేశీ ఐటీ, ఫార్మాపై ప్రభావం అంతంతే..

29 Dec, 2020 00:39 IST|Sakshi

బ్రెగ్జిట్‌పై పరిశ్రమ నిపుణుల అంచనా

బెంగళూరు: యూరోపియన్‌ యూనియన్‌ మార్కెట్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగినప్పటికీ (బ్రెగ్జిట్‌) దేశీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫార్మా సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్‌ అనంతరం కూడా ఆయా సంస్థల వ్యాపారాలు యథాప్రకారమే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ టెకీలకు ఇప్పటికే బ్రిటన్, ఇతర యూరప్‌ దేశాలు వేర్వేరు వీసా విధానాలు పాటిస్తున్నందున ఈ విషయంలో పెద్దగా మారేదేమీ లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు.

మరోవైపు, బ్రిటన్‌లో భారతీయ ఫార్మా సంస్థలు కీలకంగా ఎదిగే అవకాశం దక్కగలదని బయోటెక్‌ దిగ్గజం బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌–షా తెలిపారు. ‘బ్రెగ్జిట్‌ తర్వాత బ్రిటన్‌తో భారత్‌ పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం లభించగలదని భావిస్తున్నా. ఫార్మా రంగం కూడా ఇందులో ఒకటి కాగలదు‘ అని ఆమె చెప్పారు. డిసెంబర్‌ 31న యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగనుంది. 

మరిన్ని వార్తలు