50 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం: పాతాళానికి పాక్‌ కరెన్సీ

3 Mar, 2023 20:23 IST|Sakshi

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజాగా దేశంలో ద్రవ్యోల్బణం తారా స్తాయికి చేరి  50 ఏళ్ల గరిష్టం వద్ద కొత్త రికార్డు సృష్టించింది. తొలిసారి పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం 31.5 శాతానికి  చేరింది. జూలై 1965లో డేటా-కీపింగ్  మొదలైనప్పటినుంచి ఏప్రిల్ 1975లో ఒకసారి ద్రవ్యోల్బణం భారీగా పెరిగినప్పటికీ,  29 శాతంగా ఉండట గమనార్హం.

పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) తాజాగా  గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో వినియోగదారుల ధరల సూచీ 31.5 శాతం వద్ద మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) ప్రకారం, అమెరికా డాలర్‌తో పోలిస్తే  పాక్‌ రూపీ గణనీయంగా పడిపోయింది.ఈ ఏడాది 20 శాతం  క్షీణించి డాలర్‌ మారకంలో  284 వద్ద రికార్డు స్థాయికి  క్షీణించింది.  దీంతో దక్షిణాసియా దేశం ఇప్పుడు ప్రపంచంలో 17వ అత్యంత ఖరీదైన దేశంగా అవతరించింది.పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ విదేశీమారకద్రవ్య నిల్వలు మూడు వారాల దిగుమతులకు సరిపడా స్థాయికి పడిపోయాయి.

ఇది ఇలా ఉంటే గత నెల ప్రారంభం నుండి చర్చలు జరుపుతున్నప్పటికీ ఐఎంఎఫ్‌ నిధుల అంశం ఒక కొలిక్కి రావడం లేదు. ఈ ఆలస్యం కరెన్సీ మార్కెట్‌లో అనిశ్చితిని సృష్టిస్తోందని కరాచీకి చెందిన బ్రోకరేజ్ హౌస్ టాప్‌లైన్ సెక్యూరిటీస్‌కు చెందిన మహ్మద్ సోహైల్ అన్నారు. మరోవైపు వచ్చే వారం నాటికి ఐఎంఎఫ్‌ ప్రాథమిక డీల్‌పై ఆర్థిక మంత్రి దార్ భారీ ఆశలు పెట్టుకున్నారు.  

మరిన్ని వార్తలు