Inflation Effect: చిప్స్‌ ప్యాకెట్లలో ఇక మరింత గాలి

19 Mar, 2022 17:02 IST|Sakshi

చాప కింద నీరులా అమెరికాను ద్రవ్యోల్బణం చుట్టేస్తోంది. 2008 కంటే గడ్డు పరిస్థితులు అమెరికాలో రాబోతున్నాయన్నట్టుగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఉక్రెయిన్‌, రష్యా వ్యవహారంలో అమెరికా తలదూర్చడంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ మరింత ఘోరంగా మారుతోంది. 

అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. గతేడాది ఫిబ్రవరి  ద్రవ్యోల్బణంతో పోల్చితే దాదాపు 7.9 శాతం పెరిగింది. ఉక్రెయిన్‌ సంక్షోభం తర్వాత ఇది మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ద్రవ్యోల్బణ పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడి కంపెనీలు తమ మార్కెటింగ్‌ స్ట్రాటజీని మారుస్తున్నాయి.

సాధారణంగా ద్రవ్యోల్బణం మితిమీరితే వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజల కొనుగోలు శక్తిని దాటి ధరల పెరుగుదల ఉంటే క్రమంగా కొనుగోలు సామర్థ్యం పడిపోతుంది. దీని వల్ల కంపెనీలు పరోక్షంగా తమ మార్కెట్‌ బేస్‌ను కోల్పోతాయి. అలా అని ధరలు పెంచకుండా ఉంటే లాభాలు రావు. దీనికి మధ్యే మార్గంగా ధరలు పెంచకుండా లాభాలు కాపాడుకునే పనిలో పడ్డాయి అక్కడి కంపెనీలు.

అమెరికాలో ద్రవ్యో‍ల్బణ పరిస్థితులకు ఎలా ఉన్నాయో అంచాన వేసేందుకు చిప్స్‌ ప్యాకెట్ల మార్కెట్‌ స్ట్రాటజీని పరిశీలిస్తే చాలు.. మన దగ్గర కూడా చిప్స్‌ ప్యాకెట్స్‌ అంటే.. చిప్స్‌ తక్కువ గాలి ఎక్కువ అనే అనుకుంటాం. దీనిపై ఎన్నో మీమ్స్‌ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ మీమ్స్‌ని మరింతగా నిజం చేస్తోంది డోరిటోస్‌ కంపెనీ.

అమెరికాలో డోరిటోస్‌ చిప్స్‌ చాలా పాపులర్‌. ఆ కంపెనీ తమ చిప్స​ ప్యాకెట్‌ ధర పెంచకుండా ఐదు గ్రాముల బరువు తగ్గించింది. గతంలో 276 గ్రాముల బరువు ఉండే చిప్స్‌ ప్యాకెట్‌ ఇప్పుడు 262 గ్రాములకు పడిపోయింది. అంటే ప్రతీ ప్యాకెట్‌లో ఐదు చిప్స్‌కి కోత పెట్టింది డోరిటోస్‌. ఇలా ప్రతీ ప్యాకెట్‌లో కోత పెట్టడం వల్ల ఆ కంపెనీకి ఏడాదికి 50 మిలియన్‌ డాలర్ల సొమ్ము కలిసి వస్తుందట. ఈ మేరకు అమెరికా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇక డోరిటోస్‌ బాటలోనే పయణిస్తోంది పెప్సీకి చెందిన గటోరడే డ్రింక్స్‌. ఈ కంపెనీకి చెందిన డ్రింక్‌ 946 మిల్లీ లీటర్లలో లభించేంది. కాగా ప్రస్తుతం దీని ధరను మార్చకుండా క్వాంటిటీ తగ్గించి 828 ఎంఎల్‌కి పరిమితం చేశారు. ఇలా ధరలు పెంచకుండా క్వాంటిటి తగ్గించేస్తున్నాయి అక్కడి కంపెనీలు. అమెరికాలో చాలా కంపెనీలో డోరిటోస్‌, గటోరడే బాటోలనే పయణిస్తున్నాయి. టాయిలెట్‌ పేపర్‌ కంపెనీ బౌంటీ గతంలో 165 షీట్స్‌ అందించేది ఇప్పుడు 147కే ఫిక్స్‌ చేసింది.

ప్రజల దృష్టి ఎప్పుడు ధరల మీదే ఉంటుందని, వారి ఆదాయం పడిపోయిన వేళ ధర ఏమాత్రం పెరిగినా కొనేందుకు సందేహిస్తారని, అందుకే ధరల జోలికి పోకుండా క్యాంటిటీ కట్‌ చేస్తున్నట్టు ఆయా కంపెనీలు చెబుతున్నాయి.

చదవండి: అమెరికాకు ద్రవ్యోల్బణం సెగ

మరిన్ని వార్తలు